- పేరు ఫైనల్ అయితేనే రిజిస్ట్రేషన్.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకం
- ఆ తర్వాత ఈఆర్సీలో పేరు నమోదు
- ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 3 నెలల సమయం
- సీఎంతో విద్యుత్‌శాఖ అధికారుల భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్‌శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన మూడో డిస్కంకు ఏ పేరు పెట్టాలనే విషయంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కరెంట్సప్లయ్చేసే డిస్కమ్‌కు నార్త్డిస్కం అని, దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా సరఫరా చేసే డిస్కమ్‌కు సౌత్డిస్కం అని ఇదివరకే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన డిస్కం రాష్ట్ర మంతటా సేవలందించనుంది. దీంతో దీనికి ‘తెలంగాణ సెంట్రల్డిస్కమ్’ అని పేరు పెడతారనే చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉండగా సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సెక్రెటరియేట్లో విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.
డిస్కమ్ పేరు ఫైనల్ అయితేనే రిజిస్ట్రేషన్
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మూడో విద్యుత్ డిస్కమ్ పేరు ఫైనల్ అయితేనే రిజిస్ట్రేషన్చేయడం కుదురుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. గత రెండేండ్లుగా దక్షిణ విద్యుత్‌పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) సీఎండీగా వ్యవహరించిన ముషారఫ్ ఫారూఖీని ప్రభుత్వం మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ చేసింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన డిస్కమ్రిజిస్ట్రేషన్కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెట్టారు.
భారత విద్యుత్ చట్టం–2003 కింద రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా రెగ్యులేటరీ 04 ఆఫ్2016 నియమాలకు కట్టుబడి ఈ డిస్కమ్ పనిచేస్తుంది. డిస్కమ్పేరు ఫైనల్అయితేనే రిజిస్ట్రేషన్‌చేసి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తారు. ఆ తర్వాత డిస్కం పేరును టీజీ ఈఆర్సీలో నమోదు చేస్తారు. ఉచిత విద్యుత్కనెక్షన్లను కొత్త డిస్కమ్పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 29.08 లక్షల విద్యుత్‌కనెక్షన్లు ఈ డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి. వీటిని కొత్త డిస్కమ్‌లోకి మార్చాలంటే ముందుగా డిస్కమ్పేరుపై రిజిస్ట్రేషన్చేయాల్సిన అవసరం ఉంది.
మరో 3 నెలల సమయం
రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తూ గతేడాది డిసెంబర్ 17న జీవో జారీ చేసింది. ఏప్రిల్1 నుంచి దీని సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. గవర్నమెంట్నుంచి డిస్కమ్పేరు ఫైనల్కాగానే ఆ తర్వాత ప్రకటించే బోర్డ్ ఆఫ్డైరెక్టర్ల పేర్లతో ఈ డిస్కమ్పరిధిలోకి వచ్చే ఆస్తులు, అప్పుల వివరాలను పేర్కొంటూ కంపెనీస్లా చట్టం ప్రకారం డిస్కమ్ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఉద్యోగుల నియామకం చేపడుతారు.
డైరెక్టర్లతో పాటు కమర్షియల్, ఆపరేషన్ అండ్మెయింటెనెన్స్, అకౌంట్స్, ఐటీవిభాగం, రెగ్యులేటరీ, 660 మంది ఇంజనీర్లు, 1000 మంది సిబ్బంది, 340 మంది పరిపాలనా ఉద్యోగులను నియమించాల్సి ఉన్నది. అయితే, మూడో డిస్కం విద్యుత్‌కనెక్షన్లు ఉచితం కావడంతో ఇందులో పనిచేయడానికి ఇతర శాఖల నుంచి ఉద్యోగులు జంకుతున్నట్లుగా తెలిసింది. ఈ డిస్కమ్‌ను ప్రైవేటీకరిస్తారనే భయంతో ఆందోళనతో ఉద్యోగులు ఇందులోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు.
దీంతో కొత్త సీఎండీ ముందుగా ఉద్యోగుల సర్వీస్రూల్స్విషయంలో స్పష్టత తీసుకొచ్చి, వారి ఉద్యోగాలకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం తరపున సర్క్యులర్లు, జీవోలు జారీ చేయించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే కొత్త డిస్కం ఫంక్షనింగ్కావడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని విద్యుత్‌శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పనిచేయనున్న డిస్కమ్
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న రెండు డిస్కమ్‌లు కూడా నార్త్, సౌత్‌లుగా విడిపోయి కొన్ని జిల్లాలకే పరిమితమయ్యాయి. వరంగల్ కేంద్రంగా ఎన్పీడీసీఎల్, హైదరాబాద్ కేంద్రంగా
ఎస్‌పీడీసీఎల్ పనిచేస్తున్నది. అయితే మూడో డిస్కమ్ మాత్రం తన పరిధిని విస్తరించుకొని ఉన్నది. ఇందులో రాష్ట్రంలో వ్యవసాయ ఉచిత విద్యుత్‌కనెక్షన్లు 29,05,779, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(ఎల్ఐఎస్) కనెక్షన్లు 489, హైదరాబాద్జలమండలి 99, మిషన్ భగీరథ 1,132, మున్సిపాలిటీల పరిధిలోని ప్రత్యేక డీటీఆర్‌ల నీటి కనెక్షన్లు 639 ఉన్నాయి.
వీటన్నింటినీ మూడో డిస్కమ్‌కు బదిలీ చేయనున్నారు. దీంతో ఈ డిస్కమ్‌కు పెట్టే పేరు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా డిస్కమ్పనిచేయనున్న నేపథ్యంలో ‘తెలంగాణ సెంట్రల్ డిస్కమ్’ అనే పేరు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలిసింది. ఈ పేరే ఫైనల్అవుతుందా? లేక మరేదైనా కొత్త పేరు సూచిస్తారా? అనేది సీఎం రేవంత్ఫైనల్ చేయనున్నారు.
