
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కత్తిపోట్లు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు ఓ విదేశీయుడిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమాలియా దేశానికి చెందిన అహ్మద్(25), యూనిస్ అబ్ది కరీం హసన్(22) చదువుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. మాసబ్ ట్యాంక్‌లో నివాసం ఉంటూ హిమాయత్ నగర్‌లోని ఓ కాలేజీలో బీసీఏ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈనెల (జూలై) 8వ తేదీ రాత్రి మాసబ్ ట్యాంక్ నుంచి బైక్‌పై ఐటీ కారిడార్‌కు వెళ్లారు.
ఐకియా వద్ద అర్ధరాత్రి 2 గంటల ప్రాంతలో యూ టర్న్ తీసుకుంటున్న క్రమంలో అటుగా వెళ్తున్న వేరే యువకులతో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన గుర్తు తెలియని వ్యక్తులు సోమాలియా యువకులపై దాడి చేశారు. అందులో ఓ యువకుడు సోమాలియా విద్యార్థి అహ్మద్ కడుపులో కత్తితో పొడిచాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అహ్మద్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం పక్కనే ఉన్న మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు.
►ALSO READ | ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపించిన అల్లుడు.. దృశ్యం 2 సినిమా చూసి స్కెచ్..
శస్త్రచికిత్స అనంతరం బాధితుడు అహ్మద్ కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై అహ్మద్ స్నేహితుడి యూనిస్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూనిస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అహ్మద్‌పై దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. నిందితుల బైక్ నెంబర్లు కనిపించకపోవడంతో ఐటీ కారిడార్‌లోని సీసీ కెమెరాలు నిశితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.