బూటకపు ఎన్​కౌంటరన్న మావోయిస్టు పార్టీ

బూటకపు ఎన్​కౌంటరన్న మావోయిస్టు పార్టీ
  •     26 మందిపై రూ.1.32 కోట్ల రివార్డు     
  •     మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అడవుల్లో శనివారం జరిగిన ఎన్​కౌంటర్​లో చనిపోయిన నక్సలైట్ల గుర్తింపు పూర్తయింది. ఆదివారం ఉదయం మృతదేహాలను స్పెషల్​ టీంలు అడవి నుంచి బయటకు తీసుకొచ్చాయి. లొంగిపోయిన నక్సలైట్ల సాయంతో మృతదేహాలను గుర్తించారు. చనిపోయిన 26 మందిలో ఆరుగురు మహిళా నక్సలైట్లున్నారు. అందరిపైనా కలిపి రూ.1.32 కోట్ల రివార్డున్నట్టు బస్తర్​ ఐజీ సుందర్​ రాజ్​ ప్రకటించారు. ఎన్​కౌంటర్​ జరిగిన చోటు నుంచి 29 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వాటిలో ఐదు ఏకే 47 తుపాకులు, ఒక ఏకే యూబీజీఎల్​ అటాచ్​మెంట్​, 9 ఎస్​ఎల్​ఆర్​లు, ఒక ఇన్సాస్​ రైఫిల్​, మూడు 303 రైఫిళ్లు, తొమ్మిది 12 బోర్​ తుపాకులు, ఒక పిస్టల్​ ఉన్నాయన్నారు. చనిపోయినోళ్లలో మావోయిస్ట్​పార్టీ సెంట్రల్​ కమిటీ మెంబర్​ మిలింద్​ తేల్​తుంబ్డే ఉన్నట్టు కన్ఫర్మ్​ చేశారు. కమాండర్లు లోకేశ్​ అలియాస్​ మంగు పొడియం, మహేశ్​ అలియాస్​ శివాజీలున్నట్టు చెప్పారు. మిగతా వారిని అడమా పొడియం, దలుసు రాజు, ప్రమోద్​, కోసా, నేరా, చేతన్​ పారా, విమల, కిషన్​, ప్రదీప్​(తేల్తుంబ్డే బాడీగార్డు), ప్రకాశ్‍, లచ్చు (బాడీగార్డు), నక్లూరాం తదితరులున్నారని పేర్కొన్నారు. మరణించిన మావోయిస్టుల్లో ఏడుగురు చత్తీస్​గఢ్​లోని బస్తర్​కు చెందిన వారని ఐజీ చెప్పారు.
  
న్యాయవిచారణ జరిపించాలె: మావోయిస్టు పార్టీ

గ్యారపట్టి అడవుల్లో జరిగింది బూటకపు ఎన్​కౌంటర్​ అని మావోయిస్ట్​ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి జిల్లాల కమిటీ కార్యదర్శి ఆజాద్​ మండిపడ్డారు. చత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేంద్ర సర్కారు కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని, ఇందుకు వాళ్లు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బూటకపు ఎన్​కౌంటర్​పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ ఉద్యమాలను అణచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్​ డిపార్ట్​మెంట్​ ద్వారా ఇన్ఫార్మర్​ వ్యవస్థను పెంచిపోషిస్తున్నాయని మండిపడ్డారు. అమాయకులకు డబ్బులు ఎరవేసి.. వారి ద్వారా మావోయిస్టుల కదలికలను తెలుసుకుంటున్నాయన్నారు. మావోయిస్టులను అంతమొందించేందుకు తీవ్రస్థాయిలో నెట్​వర్క్​ను బలోపేతం చేస్తున్నాయన్నారు. దండకారణ్యంలోని అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్​, ఎంఎన్​సీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, వారి దోపిడీకి అడ్డుగా ఉన్నామనే మావోయిస్టు పార్టీపై అణచివేతకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.