ఎంతైనా సప్లై చేస్తం మా ఆయిల్ కొనండి..భారత్ కు అమెరికా ఆఫర్

ఎంతైనా సప్లై చేస్తం మా ఆయిల్ కొనండి..భారత్ కు అమెరికా ఆఫర్
  • ఢిల్లీలో ప్రధాని మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి రూబియో భేటీ
  • వైట్​హౌస్​ టూర్​కు ఆహ్వానం.. ట్రంప్ తరఫున ప్రత్యేక పిలుపు
  • ఇరాన్ యుద్ధం వేళ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అమెరికా ఇంధన వనరుల ఆఫర్
  • భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల బలోపేతంపై చర్చ

న్యూఢిల్లీ:నాలుగు రోజుల భారత పర్యటనకోసం వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి  మార్కో రూబియో  ప్రధాని నరేంద్ర మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. శనివారం ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’లో దాదాపు గంటకు పైగా సాగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఇరు దేశాల రక్షణ, వాణిజ్యం, వ్యూహాత్మక సాంకేతికత, ఇంధన భద్రత, పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభంలాంటి పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రధాని మోదీకి వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ పర్యటనకు రావాల్సిందిగా రూబియో అధికారిక ఆహ్వానాన్ని అందించారు. 

భారత ఇంధన భధ్రతకు ఎంత చమురు కావాలన్నా తాము సరఫరా చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ‘‘గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇరాన్ బందీగా మార్చుకోవడాన్ని అమెరికా ఎంతమాత్రం సహించదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల వెనిజువెలాపై పట్టు సాధించిన అమెరికా.. అక్కడి ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్లోకి తెచ్చి భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి దేశాల ఎనర్జీ అవసరాలు తీర్చాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కో రూబియో భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావడం ఇదే తొలిసారి. ఆయనకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్వాగతం పలికారు. కాగా, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఇంధన రంగాల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్న తరుణంలో.. ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం ముదిరిన వేళ రూబియో పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది.

చైనాకు చెక్.. క్వాడ్ కూటమికి పునరుజ్జీవం!

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా పాల్గొన్నారు. ఇండో-–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే అంశంపై ఇరుపక్షాలు చర్చించినట్టు ఆయన పేర్కొన్నారు. చైనాను ఎదుర్కోవడంలో భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమెరికా ఎప్పుడూ ఒక బలమైన శక్తిగా భావిస్తోందని గోర్ గుర్తుచేశారు. ‘‘భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో భారత్–-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధాని మోదీతో ఫలప్రదమైన చర్చలు జరిగాయి. 

అమెరికాకు భారత్ అత్యంత కీలకమైన భాగస్వామి’’ అని సెర్గియో గోర్ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ వేదికగా వెల్లడించారు. అలాగే మే 26న జరగబోయే క్వాడ్ (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) విదేశాంగ మంత్రుల సమావేశానికి కూడా రూబియో హాజరుకానున్నారు. ట్రంప్ తన మొదటి విడతలో క్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత దీన్ని పక్కనబెట్టారు. మళ్లీ ఇప్పుడు దీన్ని బలోపేతం చేయాలని అమెరికా భావిస్తోంది.

భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-అమెరికా బంధం పటిష్టం: రూబియో

ప్రధాని మోదీతో భేటీ అనంతరం మార్కో రూబియో ఢిల్లీలోని యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంబసీలో మీడియాతో మాట్లాడారు. భారత్-–అమెరికా సంబంధాలు అత్యంత దృఢంగా ఉన్నాయని  స్పష్టం చేశారు. ‘‘ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య వ్యక్తిగతమైన, బలమైన అనుబంధం ఉంది. ట్రంప్ మొదటి విడత పదవీకాలం నుంచే ఈ సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఇండో-–పసిఫిక్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మా వ్యూహాలకు భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్న సంబంధమే అత్యంత కీలకం. క్వాడ్  కూటమి విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఇక్కడే నిర్వహించాలనుకోవడం.. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మేమిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం.

 అమెరికాలో భారతీయ కంపెనీలు దాదాపు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి” అని వివరించారు. ఇరాన్-–అమెరికా మధ్య  ఉద్రిక్తతలు మరెంతో కాలం కొనసాగవని, దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవడానికే అమెరికా మొగ్గు చూపుతుందని, అయితే, ఏదో ఒక రకంగా ఈ వివాదానికి ముగింపు పలకాల్సిందేనని స్పష్టం చేశారు. భారతీయులకు వీసా నిబంధనల కఠినతరంపై వస్తున్న వార్తలపై రూబియో క్లారిటీ ఇచ్చారు. 

‘‘ఇది కేవలం భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి చేసిన మార్పు కాదు, ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. మేం ‘అమెరికా ఫస్ట్ వీసా షెడ్యూల్’ను తీసుకువస్తున్నాం. వ్యాపార, వృత్తిపరమైన నిపుణులకు ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. కొత్త విధానం వల్ల వీసా ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా మారుతుంది’’ అని ఆయన చెప్పారు.

ప్రపంచ శాంతి కోసమే మా ప్రయత్నం: మోదీ

రూబియోతో భేటీ అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ వేదికగా స్పందించారు. ‘‘భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిపై, అలాగే ప్రాంతీయ, ప్రపంచ శాంతి-భద్రతలపై మేం చర్చించాం. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయి” అని పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏ సమస్యనైనా చర్చలు, శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని, శాంతి పునరుద్ధరణకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.