
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌లో కల్లోలానికి రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్న, పర్యవేక్షణ చేస్తున్న వారే కారణమని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్‌కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటూ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ వ్యవహార శైలితో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోందన్నారు. ‘‘మాణిక్కం ఠాగూర్ చేతిలో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నట్టు లేదు. ఠాగూరే.. రేవంత్ చేతిలో పనిచేస్తున్నట్టు ఉంది. రేవంత్‌కు ఏజెంట్లా ఠాగూర్ మారినట్లు ఉంది” అని శశిధర్‌రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీకి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపించారు. ‘‘సీనియర్లను గోడకేసి కొడుతా అన్నా.. హోంగార్డులతో పోల్చినా అధిష్టానం నుంచి మందలింపు లేదు. ఆఖరికి రాహుల్ నోటి నుంచి కూడా వాళ్లకు నచ్చినట్లు మాట్లాడించుకున్నరు” అని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్నారు.
40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలే
పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర కలత చెందానని, 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని మర్రి శశిధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపిజం పెరిగి పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.