హైదరాబాద్ లో పెండ్లి పేరిట నమ్మించి వంచించిన్రు..రెండు చోట్ల ఇద్దరిపై కేసులు నమోదు

హైదరాబాద్ లో పెండ్లి పేరిట నమ్మించి వంచించిన్రు..రెండు చోట్ల ఇద్దరిపై కేసులు నమోదు
  • తల్లులను చేసి మోసం చేసిన యువకులు

జూబ్లీహిల్స్, వెలుగు: పెండ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు అమ్మాయిని గర్భవతిని చేసి మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న బాధితురాలు అతడిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. యూసఫ్ గూడలో ఉంటున్న ఓ మహిళకు సూరారంలో ఉండే పి. నరేశ్​తో 2020లో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలం స్నేహితులుగా కొనసాగారు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని నమ్మించిన నరేశ్​యూసఫ్ గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లోని గదుల్లో పలుమార్లు లైంగికదాడి చేశాడు. 

2024లో ఏప్రిల్ లో ఆమె గర్భవతి కాగా, పప్పాయి పండ్లతో పాటు మెడిసిన్స్​ఇచ్చి గర్భస్రావం చేయించాడు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో నరేశ్​ఆమెను వదిలి మరో మహిళతో సురారంలో సహజీవనం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న బాధిత మహిళ సూరారం వెళ్లి నిలదీసింది. నరేశ్​దాడి చేయడంతో అప్పటి జగద్గిరిగుట్ట పీఎస్​లో కంప్లయింట్​చేసింది. మంగళవారం జూబ్లీహిల్స్ డీసీపీ ఆదేశాల మేరకు మధురానగర్ పీఎస్​లో కేసు నమోదు చేశారు.  

పెళ్లి పేరిట నమ్మించి.. అబార్షన్ చేయించి

ఉప్పల్: పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళను గర్భవతిని చేసి, ఆపై బలవంతంగా అబార్షన్ చేయించిన ఓ యువకుడిపై కేసు నమోదైంది. రామంతాపూర్​కు చెందిన మహిళ (34) భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు13 ఏండ్ల కొడుకు ఉన్నాడు. రెండేండ్ల కింద వరంగల్ జిల్లాకు చెందిన జి. సుమన్ (40)తో పరిచయం ఏర్పడింది. తాను కూడా విడాకులు తీసుకున్నానని ఆమెను, ఆమె కొడుకును చూసుకుంటానని, పెండ్లి చేసుకుంటానని నమ్మిబలికి శారీరకంగా దగ్గరయ్యాడు. 

ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా బలవంతంగా అబార్షన్ చేయించాడు. పెండ్లి విషయమై ప్రశ్నించగా, రూ. పది లక్షల కట్నం డిమాండ్ చేశాడు. నిలదీయగా భౌతిక దాడికి చేసి చంపేస్తామని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఉప్పల్​ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.