హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అక్రమ స్టెరాయిడ్ల గుట్టును ఆర్సీపురం ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీలలో చట్టవిరుద్ధంగా స్టెరాయిడ్లు విక్రయిస్తున్న సరసాయి రామ్, కుంచాల రవీంద్రలను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి సుమారు లక్ష రూపాయల విలువైన నిషేధిత మెఫెంటెరమైన్ సల్ఫేట్ (Wofen 10ml) రకానికి చెందిన 227 బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విక్రయాలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఆన్లైన్ పేమెంట్స్ ద్వారానే నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ అక్రమ విక్రయాలలో వినియోగదారులుగా ఉన్న దీపక్, సాయి ప్రసాద్, షకీల్, కిషోర్ ,నితీష్ అనే మరో ఐదుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జిమ్‌ల పేరుతో అమాయక యువత ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి అక్రమ స్టెరాయిడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
