మెహిదీపట్నం, వెలుగు: సిటీలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, అత్యవసర సమయాల్లో పోలీసు బలగాల మోహరింపు సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్రమోహన్ నేతృత్వంలో సోమవారం అర్ధరాత్రి ప్రత్యేక విన్యాసం (మొబిలైజేషన్ ఎక్సర్సైజ్) నిర్వహించారు.
మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ డ్రిల్‌లో హోంగార్డుల నుంచి ఏసీపీ స్థాయి వరకు సుమారు 650 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు అతి తక్కువ సమయంలో నిర్ణీత ప్రదేశానికి చేరుకోవడం, జోనల్ కంట్రోల్ రూమ్‌తో సమన్వయం చేసుకోవడం, అల్లర్ల నియంత్రణ పరికరాల వినియోగంపై సిబ్బందికి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రాథమిక విధి అని, క్లిష్ట సమయాల్లో బలగాల సన్నద్ధత అత్యంత కీలకమని ఈ సందర్భంగా డీసీపీ పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ పోలీసు యంత్రాంగం చూపిన అప్రమత్తతను ఆయన అభినందించారు.
