IPL 2023: ఆర్సీబీ టీమ్ సమాచారం ఇవ్వండి.. సిరాజ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి మెసేజ్

IPL 2023: ఆర్సీబీ టీమ్ సమాచారం ఇవ్వండి.. సిరాజ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి మెసేజ్

ఐపీఎల్ 2023లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ను గుర్తుతెలియని వ్యక్తి సంప్రదించి మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.  దీంతో అప్రమత్తమైన సిరాజ్ ఈ విషయాన్ని వెంటనే  బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేశాడు. 

సిరాజ్కు వాట్సాప్ మెసేజ్ లు..

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి  క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో  భారీ మొత్తంలో డబ్బును పోగొట్టుకున్నాడు.  ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో సదరు వ్యక్తి బెట్టింగ్ లో డబ్బులు పొగొట్టుకున్నాడని సమాచారం. అయితే  ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కావడంతో మరోసారి బెట్టింగ్ పెట్టేందుకు ఆర్సీబీ టీమ్  సమాచారం కోసం సిరాజ్ ను సంప్రదించాడు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పొగొట్టుకున్నానని....తనకు సాయం చేయాలని ఓ వ్యక్తి మహ్మద్ సిరాజ్ కు వాట్సన్ మెసేజ్ లు చేశాడు.  ఈ మొత్తం విషయాన్ని సిరాజ్ వెంటనే బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి చెప్పాడు. సిరాజ్ ఫిర్యాదు తర్వాత బీసీసీఐ యాంటీ కరెప్షన్ యూనిట్ ఈ విషయంపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ వ్యక్తిని ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకున్నారు. 

బుకీ కాకపోవచ్చు..

సిరాజ్ కు వాట్సాప్ మెసేజ్ చేసిన వ్యక్తిని హైదరాబాద్‌కు చెందిన ఓ డ్రైవర్‌గా గుర్తించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతనికి బుకీలు లేదా బెట్టింగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ఆరా తీస్తోన్నట్లు పేర్కొన్నాయి. అతను బుకీ కాకపోవచ్చని ప్రాథమికంగా భావిస్తోన్నట్లు బీసీసీఐ యాంటీ కరెప్షన్ యూనిట్ అధికారి అభిప్రాయపడ్డారు. ఆ వ్యక్తి- ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ లు పెట్టి నష్టపోయాడని.. దాన్ని మళ్లీ సంపాదించుకోవడానికి ఆర్సీబీపై బెట్టింగులు పెట్టాలని నిర్ణయించకున్నాడని తెలిపారు.  అందుకే జట్టుకు సంబంధించిన అంతర్గత సమాచారం..ప్లేయర్ల వివరాల కోసం సిరాజ్‌ను సంప్రదించినట్లు  ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం దీనిపై దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని..దర్యాప్తు  పూర్తయ్యాక అన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు. అయితే మహ్మద్ సిరాజ్ స్వస్థలం కూడా హైదరాబాదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ వ్యక్తితో  సిరాజ్‌కు గతంలోనే  సంబంధాలు ఉన్నాయా.. అనే కోణంలోనూ  దర్యాప్తు సాగిస్తోన్నట్లు తెలుస్తోంది.