- గోడు వెళ్లబోసుకున్న బాధిత యువతి
పంజాగుట్ట, వెలుగు: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ప్రొఫైల్ చూసి, పెండ్లి పేరుతో 8 మంది యువకులు తనను దారుణంగా వంచించారని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ప్రొఫైల్పెట్టడమే నేరమా? అని ప్రశ్నించింది. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె తన గోడును వెళ్లబోసుకుంది. ఏపీలోని మచిలీపట్నానికి చెందిన శిరీష ఆరేండ్ల కిందట ఉద్యోగ నిమిత్తం యూఎస్‌కు వెళ్లింది. అక్కడ స్థిరపడ్డ తెలుగబ్బాయినే పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తన వివరాలను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ఉంచింది.
ఆ వివరాలను గమనించిన కొందరు తెలుగు యువకులు.. యూఎస్‌లో తమకు తెలుగమ్మాయి దొరికిందని, ఇటువంటి సంబంధాల కోసమే తాము ఎదురుచూస్తున్నామని నమ్మబలికారు. పెండ్లి పేరుతో ఆమెను శారీరకంగా వాడుకుని మొహం చాటేశారు. ఆరేండ్ల కాలంలో సుమారు 8 మంది తెలుగు యువకులు తనను మోసం చేశారని బాధితురాలు తెలిపింది.
రెండేండ్ల కింద నగరానికి రాగా, అదే వ్యక్తులు మళ్లీ తనను సంప్రదించి వివిధ యాప్‌లలో పెట్టుబడుల పేరుతో సుమారు రూ. 16 లక్షలు కాజేశారని వాపోయింది. తనకు జరిగిన అన్యాయం మరే ఇతర యువతికి జరగకూడదనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చానని, అమ్మాయిలు తమ వ్యక్తిగత వివరాలను వెబ్సైట్లలో షేర్ చేసి మోసపోవద్దని ఆమె హెచ్చరించింది.
