ఒడిశాలో ఆయుధాల డంపు స్వాధీనం

ఒడిశాలో ఆయుధాల డంపు స్వాధీనం

భద్రాచలం, వెలుగు: ఒడిశా రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ ఆయుధాల డంపును ‘ఈ 30’ బలగాలు శనివారం స్వాధీనం చేసుకున్నాయి. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు 36 గంటలపాటు మైన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలూడిగ్గీ గ్రామ అడవుల్లో ఆరు ప్రాంతాల్లో డంపులను గుర్తించారు. ఈ డంపుల్లో 2 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక .303 రైఫిల్, దేశీ తుపాకీ, బీజీఎల్ లాంచర్, 12 బోర్ తుపాకులు, సింగిల్ షాట్ తుపాకీలు, 127 రౌండ్లు, 8 మ్యాగజైన్లు, 22 బీజీఎల్ సెల్స్ తదితర సామగ్రి లభ్యమైంది. మావోయిస్టులు ఆయుధాల మరమ్మతులకు ఉపయోగించే పరికరాలు, వర్క్‌షాప్ కూడా గుర్తించారు.

ఐఈఈడీలు, దేశీ తుపాకీలను ఇక్కడే తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఆపరేషన్ విరాట్’ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో 240 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 17 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 7 ఐఈఈడీలు, వంద మీటర్ల వైరు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 57 ఆటోమెటిక్, నాన్ ఆటోమెటిక్ ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇంకా అడవుల్లో డంపులు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.