రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: మాయావతి

రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: మాయావతి

లక్నో: రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లోత్‌పై బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. గెహ్లోత్ తమ పార్టీని మోసం చేశారని, బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేరేలా చేశారని ఆమె విమర్శించారు. రాజస్థాన్‌లో సర్కార్‌‌ కూలాలని బీజేపీ కుట్ర పన్నుతోందని గెహ్లోత్ కామెంట్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకప్పుడు బీఎస్పీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ కూడా అదే చేసిందని మాయావతి గుర్తు చేశారు.

‘రాజస్థాన్ సీఎం తొలుత యాంటీ డిఫెక్షన్ లాను ఉల్లంఘించారు. అలాగే బీఎస్పీ ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా మమ్మల్ని మోసగించారు. ఫోన్స్‌ను అక్రమంగా ట్యాప్ చేయడం ద్వారా మరోమారు ఆయన అలాంటి చర్యలకే పాల్పడ్డారు. రాజస్థాన్‌ గవర్నర్ వెంటనే రంగంలోకి దిగి తమ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్తవ్యస్థ పరిస్థితులను చక్కబెట్టాలి. ప్రభుత్వం అస్థిరంగా ఉన్నందున అక్కడ రాష్ట్రపతి పాలనను విధించాలి. తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని మాయావతి ట్వీట్ చేశారు.