- ఈ నెల 21 సాయంత్రం 4 గంటల వరకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కన్వీనర్ కోటా ఫేజ్–-2 ఎంబీబీఎస్ సీట్లు పొందిన అభ్యర్థుల రిపోర్టింగ్ గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) పొడిగించింది. ఈ విడతకు సంబంధించిన సీట్ల కేటాయింపు ఉత్తర్వులు సెప్టెంబర్ 15న వెలువడగా, తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 19 సాయంత్రం 4 గంటలతో రిపోర్టింగ్ గడువు ముగిసింది.
అయితే, విద్యార్థుల సౌకర్యార్థం ఈ గడువును సెప్టెంబర్ 21 సాయంత్రం 4 గంటల వరకు పొడిగిస్తూ వర్సిటీ నిర్ణయం తీసుకుంది. రెండో విడతలో సీట్లు పొంది ఇప్పటివరకు కేటాయించిన కాలేజీల్లో చేరని అభ్యర్థులు ఈ పొడిగించిన గడువులోగా వెళ్లి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు కాలేజీల్లో చేరిన, చేరని విద్యార్థుల పూర్తి వివరాలను సంబంధిత మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు సెప్టెంబర్ 21న సాయంత్రం 4:30 గంటలలోపు వర్సిటీ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.
