మేడారం జాతర చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసేలా.. వన దేవతల గద్దెలు, జంపన్నవాగు ఆధునికీకరణ పనులు తరతరాలు నిలిచేలా ప్రజాప్రభుత్వం సిద్ధం చేయిస్తున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన సమ్మక్క–సారలమ్మ మేడారం మహా జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజులలో జరుగుతోంది. దశాబ్దాల కాలం నుంచి బుధ, గురు, శుక్ర, శనివారాలలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
ఈ మహా జాతరను ‘తెలంగాణా కుంభమేళా’గా పేర్కొంటారు. ఈ జాతరకు లక్షలాది మంది తరలివస్తారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవార్లకు ఘనమైన పూజలు చేస్తారు. ఇంత పెద్ద ఎత్తున జరిగే జాతరకు ఈసారి మేడారం పున:నిర్మాణం పనుల వలన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
నేడు మేడారం స్వరూపం పూర్తిగా మారిపోయింది. నాటి మేడారానికి నేటి మేడారానికి ఎంతో తేడా కనిపిస్తోంది. భక్తులు మెచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి జాతర నిర్వహణకు అవసరమైన అభివృద్ధి పనులు భారీస్థాయిలో చేపట్టారు. ఆదివాసీ పెద్దలు, పూజారుల సంఘం సంపూర్ణ ఆమోదంతోనే మేడారం అభివృద్ధి పునర్నిర్మాణ పనులకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
జాతర నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనులు అద్భుతంగా చేపడుతోంది. మేడారం సమ్మక్క– సారలమ్మ మహా జాతరకు విస్తృత ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం వందల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా నిలిచేలా గద్దెల శాశ్వత పున: నిర్మాణం పనులు చేపట్టింది.
పిల్లర్లపై సంస్కృతి, ఆచారాలు
మేడారం గద్దెల చుట్టూ నిర్మిస్తున్న 32 గ్రానైట్ పిల్లర్లపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను తీర్చిదిద్దారు. మార్బుల్ శిలలతో గద్దెలు, జంపన్నవాగు సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థలు, ఫ్లడ్ మేనేజ్‌మెంట్, 60 అడుగుల నుంచి నాలుగు లైన్లకు రోడ్ల విస్తరణ, క్యూ లైన్లు, సత్రాలు, వాచ్ టవర్లు, గ్రీనరీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
మరోవైపు జాతర సజావుగా జరిగేందుకు మహా కుంభమేళాలో భాగస్వాములైన నిపుణుల బృందం మేడారానికి చేరుకుంది. జాతర జరిగే ప్రాంతం, అక్కడికి దారితీసే మార్గాలు, జాతర రద్దీ ఉండే ఉప ఆలయాలను సందర్శించి.. అధికారులకు తగిన సూచనలు..సలహాలు అందించింది. ఈసారి జాతరకొచ్చే భక్తులకు పార్కింగ్ సమస్య తలెత్తకుండా గద్దెల సమీపంలోనే ఏకకాలంలో వేల వాహనాల పార్కింగ్‌కు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ నాలుగు రోజులు డ్రోన్‌షో ప్రత్యేక ఆకర్షణ కానున్నది. జాతరపై సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు డాక్యుమెంటరీ కూడా రూపొందిస్తున్నారు.
మేడారం సమగ్రాభివృద్ధికి రూ. 251 కోట్లు మంజూరు
మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం రూ. 251 కోట్లతో మేడారం సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. గద్దెల విస్తరణకే రూ.101 కోట్లు కేటాయించింది. 4,000 టన్నుల గ్రానైట్‌తో గద్దెల ప్రాంగణ నిర్మాణ పనులు చేపట్టారు. 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7,000కి పైగా శిల్పాలు, 930 ఏళ్ల కోయల తాళపత్ర గ్రంథాల ఆధారంగా శిల్ప రూపకల్పన చేశారు.
46 స్తంభాలతో 271 చ.మీ విస్తీర్ణంలో ప్రాకారం, 8 స్తంభాలతో వృత్తాకార గద్దె నిర్మాణం చేపట్టారు. 40 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న చెట్లను తొలగించకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బండారి, మర్రి, వెదురు, వేప, ఇప్ప తదితర 12 రకాల పవిత్ర వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. 140 రకాల ఆయుర్వేద మొక్కలునాటనున్నారు.
గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్ఠంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో మూడు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలుంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం నిర్మిస్తున్నారు.
భావి తరాలకు తెలిసేలా... శిలలపై తల్లుల చరిత్ర
సమ్మక్క-సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిలలపై చెక్కించారు. కోయల వద్ద దొరికిన 930 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెక్కించిన శిల్పాలు, చిహ్నాలు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క, సారక్క పగిడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్ష్యాదులతోపాటు కోయల జీవనశైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది.
అలాగే, సమ్మక్క-సారలమ్మ వంశస్తులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వాళ్ల చరిత్రను భావితరాలు తెలుసుకునే అవకాశం దక్కుతుంది. గద్దెల ముందు తెల్లని గ్రానైట్ స్తంభాలతో ఏర్పాటు చేస్తున్న ప్రధాన ద్వారం, ఆయా శిలలపై సమ్మక్క-సారలమ్మ పూర్వీకులతోపాటు, కోయల జీవనశైలిని తెలిపేలా చెక్కిన ఏడు వేల బొమ్మలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
50 ఫీట్ల వెడల్పుతో ఉన్న ఈ ప్రధాన ద్వా రానికి 25 ఫీట్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో రెండువైపులా రెండేసి నిలువు స్తంభాలు, వాటిపై 80 పీట్ల పొడవైన అడ్డు స్తంభం, దానిమీద 60 ఫీట్ల పొడవైన మరో అడ్డు స్తంభం ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు గద్దెల చుట్టూ 25 ఫీట్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో 8 స్తంభాలు నిలుపుతున్నారు. వీటిపై సమ్మక్క- సారలమ్మ తో పాటు 3,4,5,6,7 గొట్టుగోత్రాలను బొమ్మలుగా చెక్కారు.
నాడు మాట ఇచ్చి.. నేడు నిజం చేసి..
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకున్నారు. తాము అధికారంలోకి రాగానే తప్పకుండా మేడారంలో పునర్నిర్మాణ పనులు చేసి తీరుతామని నాడు రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధికి ఇచ్చిన మాటను నేడు నిలుపుకుంటున్నారు. మేడారం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిత్యం మేడారంలో జరిగే పనులపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
మేడారం మహా జాతరను దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా కనుల పండువగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారు. మేడారం ఆలయంలో పున:నిర్మాణం పనులు వేగవంతానికి మంత్రుల బృందం ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ నిత్యం పనులను పరిశీలిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పనుల్లో పూర్తి నాణ్యత పాటించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మేడారం మహా జాతర ప్రత్యేకత
మన దేశంలో లెక్కలేనన్ని జాతర్లు ఉన్నప్పటికీ మేడారం జాతర ప్రత్యేకతే వేరు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఉత్సవంను తిలకించేందుకు ఎందరో భక్తులు ఎదరుచూస్తూ ఉంటారు. 2026 జనవరి 28వ తేదీ బుధవారం సారలమ్మ రాకతో మేడారం మహా జాతర ప్రారంభమవుతుంది. 29న గురువారం సమ్మక్క దేవత గద్దెకు రావడం, 30న శుక్రవారం భక్తులు మొక్కులు సమర్పించుకోవడం, 31వ తేదీ దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది. సమ్మక్క – సారలమ్మలను దర్శించుకునేందుకు దేశ నలు మూలల నుంచి భక్తులు వస్తారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ మహా జాతర పనులను పున: నిర్మిస్తోంది. ఈ జాతర నిస్సందేహంగా ఆథ్యాత్మిక శోభాయాత్రగా పేర్కొనవచ్చు.
- జి. లక్ష్మణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, ఐ అండ్ పీఆర్, కరీంనగర్ జిల్లా
