- 3 కోట్ల మంది భక్తులు హాజరయ్యే చాన్స్
- రూ.250 కోట్లకుపైగా నిధులతో పనులు చేపట్టినం
- మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క
- సమన్వయంతో పనిచేయాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశం
- మేడారం జాతరపై సెక్రటేరియెట్లో సమీక్ష
హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి దాదాపు 3 కోట్లమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రులు అడ్లూరి లక్షణ్ కుమార్, సీతక్క తెలిపారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర కొనసాగనున్నదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
మేడారం జాతరపై మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రులు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖల కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఇతర అధికారులు హాజరయ్యారు.
మంత్రి అడ్లూరి మాట్లాడుతూ సమ్మక్క-సారలక్క జాతరను కుంభమేళాను మించి నిర్వహిస్తామన్నారు. జాతరకు ఎన్నడూలేని విధంగా రూ.150 కోట్ల నిధులను మంజూరు చేశామని, ఈ నిధులతో మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుధ్యం, వైద్యసేవలు అందించనున్నట్లు చెప్పారు. జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ: సీఎస్ రామకృష్ణారావు
జాతర నిర్వహణ ఏర్పాట్లపై సీఎం నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు పేర్కొన్నారు. భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు, రవాణా, ఇతర సౌకర్యాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణ, పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం జాతర ఏర్పాట్లు, పురోగతిపై రోజూ తమకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
అనంతరం మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతిపై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్షణ్ కుమార్, సీఎస్ రామకృష్ణ రావు ఆవిష్కరించారు.
భక్తులకు సులభంగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు: సీతక్క
ఈసారి జాతర ఏర్పాట్ల కోసం రూ.150 కోట్లతోపాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ.101 కోట్లు మొత్తం 251 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని మంత్రి సీతక్క తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు సులభంగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె చెప్పారు. రాష్ట్రస్థాయిలో వివిధ శాఖల కార్యదర్సులు, హెచ్ఓడీలతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి జాతరను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
శానిటేషన్, తాగునీరు, రవాణా, భద్రతాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. కోట్ల మంది భక్తులు వస్తారని, టాయిలెట్లను పెంచాలని కోరారు. జాతర సందర్భంగా గురు, శుక్రవారాల్లో కనీసం 40 లక్షల మంది భక్తులు వస్తారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
