మేడారం జాతర: అదనపు చార్జీలకు సిద్ధమవుతున్న ఆర్టీసీ

మేడారం జాతర: అదనపు చార్జీలకు సిద్ధమవుతున్న ఆర్టీసీ
  • టికెట్ ధర 20 నుంచి 30శాతం పెంచాలని ప్లాన్
  • జనవరి 1 నుంచి జాతర బస్సులు ప్రారంభం
  • 2018లో జాతరకు 4,200 బస్సులు నడిపిన ఆర్టీసీ
  • అదనంగా మరో 30 డిపోల నుంచి బస్సులు
  • జాతరకు 12,500 మంది ఆర్టీసి సిబ్బంది

మేడారం సమ్మక్క,సారలమ్మ జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఫిబ్రవరి 5 నుంచి జాతర ఘనంగా ప్రారంభం కానుంది. దేశ నలు మూలల నుంచి జాతరు లక్షలాది భక్తులు తరలిరానున్నారు. దీంతో అదనపు చార్జీలకు సిద్దమవుతోంది ఆర్టీసీ. టికెట్ ధరను 20 నుంచి 30శాతం వరకు పెంచాలని ప్లాన్ చేస్తోంది.

జాతర టైంలో ప్రత్యేక బస్సులను నడపనున్న ఆర్టీసీ అధికారులు.. టికెట్ ధరను 20 నుంచి 30శాతం వరకు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సు చార్జీలను కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున పెంచారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. జనవరి ఒకటి నుంచి జాతర బస్సులను ప్రారంభించనుంది ఆర్టీసీ.

మేడారం జాతరకు 2018 లో రాష్ట్రంలోని 23 ప్రాంతాల నుంచి 4వేల 200 బస్సులను నడిపింది ఆర్టీసీ. ఈ సారి అదనంగా మరో 30 డిపోల నుంచి బస్సు సర్వీసులను నడపాలని భావిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. 25 లక్షల మంది భక్తులను ఆర్టీసీ బస్సుల ద్వారా తీసుకెళ్లి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. జాతర సమయంలో 12 వేల 500 మంది ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పనిచేయనున్నారు.

హైదరాబాద్ నుంచి మేడారానికి 2018లో ఏసీ బస్ చార్జీ 552 రూపాయలు తీసుకున్నారు. ఈసారి దానిని 660 రూపాయలుగా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.  లాస్ట్ టైం 447 రూపాయలున్న సూపర్ లగ్జరీ బస్ చార్జీని 540కు పెంచే అవకాశం ఉంది. 337 రూపాయలున్న ఎక్స్ ప్రెస్ బస్ చార్జీని 410 రూపాయలకు పెంచే చాన్స్ ఉంది. హైదరాబాద్ లో MGBS, ఉప్పల్, జగద్గిరిగుట్ట దగ్గర బస్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి జాతరకు 250 నుంచి 300 బస్సులను నడిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

మేడారం జాతరకు బస్సు సౌకర్యం కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. మేడారంలో ఆర్టీసీ బస్సుల క్యూ లైన్ల పనులను కూడా ప్రారంభించారు. బస్ స్టేషన్ తోపాటు ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేలా కంట్రోల్  రూం ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అందించి.. ఆర్టీసీకి ఆదాయం పెంచే ప్లాన్ చేస్తున్నారు అధికారులు.

Medaram Jatara: TSRTC preparing for additional charges