జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి

 జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

జగిత్యాల: రాబోయే వందేళ్లకు తగ్గ భౌగోళిక పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరూర్ క్యాంపులో ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ స్తంభించే అవకాశముందన్నారు. ఇప్పటికే అక్కడ చాలా కార్యాలయాలు, ఆర్టీసీ బస్ డిపో వంటివి ఉన్నాయి, పైగా అది రెసిడెన్షియల్ ఏరియా.. బయో మెడికల్ వేస్టేజ్ తో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేవలం జగిత్యాలకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ అందుబాటులో ఉండేలా మెడికల్ కళాశాల నిర్మాణం చేయాలని ఆయన సూచించారు.
నేనేం రాజకీయం చేయడం లేదని, ఓ ఉస్మానియా, ఓ కాకతీయ మెడికల్ కళాశాల, హాస్పిటల్ లాగా ఉపయోగపడేలా ఇక్కడ ఏర్పాటు చేయాలనేది నా తపన అని అన్నారు. జేఎన్టీయూ కాలేజీని నాచుపల్లిలో పెట్టామని మాపై ఎమ్మెల్యే నిందలు వేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. మరెక్కడ పెట్టేదుండెనో ఇప్పటికైనా ఎమ్మెల్యే సంజయ్ చెప్పాలన్నారు. జన సముదాయానికి ఆసుపత్రులెంత దూరముంటే అంత మంచిదని, భవిష్యత్తులో విస్తరణకు స్కోప్ ఉండేలా నిర్మాణం జరగాలన్నారు. ‘‘నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్స్ దగ్గరే న్యాక్ సెంటర్ ఏర్పాటు చేస్తే దానిపైన ఎమ్మెల్యే విమర్శలు చేస్తుండు. మరెక్కడ ఏర్పాటు చేసేదుండెనో ఎమ్మెల్యే చెప్పాలె.. అక్కడికి రోడ్డు వేయిపివాలె అన్నారు. చల్గల్ లో నిర్మాణం చేయాలనే నా ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోండి.. సీఎం టేబుల్ పై పెట్టండి.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసి నిర్ణయం చేయండి’’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.