మందుల క్వాలిటీలో ఫెయిలైతున్నయ్

మందుల క్వాలిటీలో ఫెయిలైతున్నయ్
  • ప్రతి నెలా 200–220 శాం పిళ్లను పరీక్షిస్తున్న డీసీఏ
  • క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అవుతున్న మందులు
  • రాష్ట్రంలో 26,076 షాపులు 589 డ్రగ్ తయారీ యూనిట్లు
  • డ్రగ్ ఇన్‌ స్పెక్టర్లు 61 మందే

రాష్ట్రంలో మందు గోలీలు, గొట్టం గోలీలు, టానిక్ లు, సూది మందులు..  ఇట్లా ఏ మందు అయినా క్వాలిటీ సరిగ్గా ఉండటం లేదు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ర్టేషన్ (డీసీఏ) అధికారులు మెడికల్ షాపుల నుంచి కలెక్ట్‌‌ చేస్తున్న శాంపిళ్లలో 3 నుంచి 4 శాతం మందులు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అవుతున్నాయి. ప్రతి నెలా డ్రగ్‌‌ ఇన్‌‌స్పెక్టర్లు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసి సగటున 200 నుంచి 220 శాంపిళ్లు సేకరిస్తున్నారు. ప్రతి నెలా3 నుంచి 4 శాతం శాంపిళ్లు ఏదో రకమైన టెస్టులో ఫెయిల్ అవుతున్నాయని ల్యాబ్‌‌లో పని చేస్తున్న సైంటిఫిక్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. ఇలా టెస్టుల్లో ఫెయిల్ అవుతున్న వాటిలో జనరిక్‌‌, బ్రాండెడ్‌‌ రెండు రకాల మందులూ ఉంటున్నాయి.

టెస్టులు ఇలా..

డ్రగ్‌‌ ఇన్‌‌స్పెక్టర్లు తెచ్చిన శాంపిళ్లకు 9 రకాల పరీక్షలు చేస్తారు. ఉదాహరణకు ఓ ట్యాబ్లెట్ తీసుకుంటే దాని డిస్ర్కిప్షన్‌‌ మొదలుకుని వెయిట్, కంటెంట్‌‌, ట్యాబ్లెట్ తయారీలో వాడిన ఇన్‌‌గ్రేడియంట్స్, మందు క్వాలిటీ, మందు సైజ్‌‌, డిజల్యుషన్‌‌ వంటి 9 రకాల టెస్టులు చేస్తారు. ఈ తొమ్మిదింటిలో ఏ టెస్టులో ఫెయిలైనా నాట్ స్టాండర్డ్‌‌ క్వాలిటీ(ఎన్‌‌ఎస్‌‌క్యూ)గా పేర్కొంటారు. అధికశాతం మెడిసిన్‌‌ ‘అస్సే’, డిస్‌‌ ఇంటిగ్రేషన్‌‌ టెస్టులో ఫెయిల్ అవుతున్నట్టు సైంటిఫిక్ ఆఫీసర్లు చెబుతున్నారు. అస్సే అంటే ట్యాబ్లెట్‌‌లో పేర్కొన్న మందు, పేర్కొన్న సైజ్‌‌లో ఉందా లేదా అని పరీక్షిస్తారు. ఉదాహరణకు100 ఎంజీ ఉండాల్సిన చోట, 70 ఎంజీ ఉంటే దాన్ని ఎన్‌‌ఎస్‌‌క్యూగా పేర్కొంటారు. ఉండాల్సిన స్థాయిలో మందు లేకపోతే, రోగం తగ్గించడంలోనూ ఆ మెడిసిన్ ఫెయిల్ అవుతుంది. డిస్ ఇంటిగ్రేషన్ టెస్ట్ అంటే కడుపులోకి వెళ్లిన తర్వాత ట్యాబ్లెట్ నుంచి మందు సకాలంలో రిలీజ్ అవుతుందా? లేదా? అని తెలుసుకునేందుకు చేసే టెస్ట్‌‌. సకాలంలో ట్యాబ్లెట్ స్ల్పిట్ అవకపోతే, అది వేసుకున్నా వృథానే అవుతుంది.

సిబ్బంది కొరత.. కొరవడుతున్న నిఘా

డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండానే షెడ్యూల్డ్ డ్రగ్స్‌‌ అమ్మడం, నాసిరకం మెడిసిన్ రోగులకు అంటగట్టడం వరకూ మెడికల్ షాపులు అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. డ్రగ్ ఇన్‌‌స్పెక్టర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. రాష్ర్టంలో 26,076 మెడికల్ షాపులు, 589 డ్రగ్ తయారీ కంపెనీలు,186 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ బాధ్యత డ్రగ్ ఇన్‌‌స్పెక్టర్లదే. కానీ, రాష్ర్టంలో 61 మంది డ్రగ్‌‌ ఇన్‌‌స్పెక్టర్లే ఉన్నారు. 30 మంది జీహెచ్‌‌ఎంసీ పరిధిలోనే పని చేస్తున్నారు. తమపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని డ్రగ్‌‌ ఇన్‌‌స్పెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 60 మంది డ్రగ్‌‌ ఇన్‌‌స్పెక్టర్లు ఉంటే తాము సమర్థంగా పని చేయగలమని డీసీఏ జాయింట్‌‌ డైరెక్టర్‌‌‌‌ వెంకటేశ్వర్లు చెప్తున్నారు.

కంపెనీలతో కుమ్మక్కు.. 

డ్రగ్‌‌ఇన్‌‌స్పెక్టర్లు తెచ్చిన శాంపిళ్లు ఫెయిలైతే, వాటిని అమ్ముతున్న షాపు నుంచి తయారీదారు వరకూ అందరికీ నోటీసులు ఇస్తారు. మార్కెట్‌‌లో ఉన్న ఆ మెడిసిన్‌‌ మొత్తాన్ని వెనక్కి తెప్పించి, నాశనం చేయాలి. ఇలా చేస్తే కంపెనీకి భారీ నష్టం వస్తుంది. ఇదే కొంతమంది ఆఫీసర్లకు ఆదాయ వనరుగా మారింది. ఓ బ్లడ్ బ్యాంక్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి, ఓ డ్రగ్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. ప్రతి నెలా3 నుంచి 4% శాంపిళ్లు ఎన్‌‌ఎస్‌‌క్యూగా తేలుతున్నట్టు సైంటిఫిక్ ఆఫీసర్లు చెబుతుంటే, అధికారిక లెక్కల్లో మాత్రం 2% లోపే టెస్టుల్లో ఫెయిల్ అవుతున్నట్టు చూపుతున్నారు. 2018–19లో 2% శాంపిళ్లు, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పరీక్షించిన వాటిలో 1.7% శాంపిళ్లు నాట్ స్టాండర్డ్‌‌ క్వాలిటీగా తేలినట్టు డ్రగ్‌‌ కంట్రోల్‌‌ అథారిటీ అధికారిక లెక్కల్లో పేర్కొన్నారు. ల్యాబ్‌‌లో టెస్ట్‌‌ చేసి రిజల్ట్‌‌ ఇవ్వడం వరకే తమ పని అని, ఆ తర్వాత డ్రగ్‌‌ ఇన్‌‌స్పెక్టర్లే చూసుకుంటారని ఓ ఆఫీసర్ తెలిపారు.