మేడిగడ్డ ఏడో బ్లాక్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు!..నిపుణుల అంచనా.. అక్టోబర్ 15 నాటికి ప్రాథమిక డిజైన్లు

మేడిగడ్డ ఏడో బ్లాక్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు!..నిపుణుల అంచనా.. అక్టోబర్ 15 నాటికి ప్రాథమిక డిజైన్లు
  • సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక కోసం వెయిటింగ్
  • ఎల్అండ్ టీతో ఖర్చు పెట్టిస్తారా? వేరే సంస్థకు ఇస్తారా? 
  • ప్రొవిజనల్ అగ్రిమెంట్ తరహా ఆలోచన 
  • వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు

హైదరాబాద్, వెలుగు: కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసి మళ్లీ అందుబాటులోకి తేవాలంటే రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. నాణ్యతా లోపంతో కుంగిన 7వ బ్లాక్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా కూల్చివేసి కొత్తగా నిర్మించాల్సిందేనని ఇప్పటికే నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ తుది నివేదికలో స్పష్టం చేసింది. ఎన్​డీఎస్​ఏ సూచనల మేరకే బ్యారేజీల్లో సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్​ఎస్​)తో టెస్టులు చేయించి రిపేర్లు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.

.అందులో భాగంగానే ఇరిగేషన్​ శాఖలోని సెంట్రల్​ డిజైన్స్ ఆర్గనైజేషన్  పునరుద్ధరణ డిజైన్లపై కసరత్తులు చేస్తున్నది. వచ్చే నెల 15 నాటికి ప్రాథమిక డిజైన్లను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. అయితే, సీడబ్ల్యూపీఆర్​ఎస్​ టెస్టుల రిపోర్టుల కోసం ఇరిగేషన్​ అధికారులు వేచి చూస్తున్నట్టు సమాచారం. ఆ రిపోర్టు వచ్చాక డిజైన్లను ఖరారు చేసి.. వాటిని ఎన్​డీఎస్​ఏ అనుమతి కోసం పంపించనున్నారు. 

మారిన రేట్లతో భారం

మేడిగడ్డ రిపేర్ల ఖర్చులు భారంగా మారుతున్నాయి. పాత (బ్యారేజీల నిర్మాణ సమయంలో) స్టాండర్డ్​ షెడ్యూల్​ ఆఫ్​ రేట్స్  ప్రకారం ఒక్క ఏడో బ్లాక్​ను తీసేసి కొత్తగా నిర్మించేందుకు రూ.800 కోట్లు అవుతాయంటున్నారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ ధరల్లో భారీ మార్పు కనిపిస్తున్నది. కొత్త ఎస్​ఎస్​ఆర్  ప్రకారమైతే ఏడో బ్లాక్​ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు అవుతాయని స్పష్టం చేస్తున్నారు. పెరిగిన ఇసుక, స్టీల్, సిమెంట్ ధరలకు అనుగుణంగా ధరలు మారుతాయని చెబుతున్నారు. ఇప్పుడున్న మొత్తం బ్లాక్​ను తొలగించడం అత్యంత క్లిష్టమైన పని అని అంటున్నారు. అయితే, డిజైన్లలో మార్పులు వచ్చి సీకెంట్​పైల్స్​ను మరింత పటిష్టం చేయాల్సి వస్తే మాత్రం ఖర్చు మరింత పెరుగుతుందని పేర్కొంటున్నారు. 

ఎల్ అండ్ టీతో చేయించడమా.. కొత్త సంస్థకా?

ఖర్చు ఒక ఎత్తైతే.. అసలు ఆ ఖర్చు ఎవరు భరించాలన్నది ఇప్పుడు అసలైన సమస్యగా మారింది. డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​లోనే సమస్యలు రావడం.. మెయింటెనెన్స్​ పీరియడ్​లోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటి కారణాల నేపథ్యంలో మేడిగడ్డను నిర్మించిన ఏజెన్సీ ఎల్​అండ్​టీతోనే చేయించాలని తొలుత నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సంస్థకూ తాకీదులు ఇచ్చారు. కానీ, ఆ సంస్థ మాత్రం లొంగట్లేదు. అడుగడుగునా కొర్రీలు పెడుతూనే ఉంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు మేడిగడ్డ పునరుద్ధరణపై అదే ఏజెన్సీతో పనిచేయించాలా లేదంటే మరో సంస్థకు అప్పగించాలా అన్న డైలమాలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ రెండూ కాని పక్షంలో ప్రొవిజనల్ అగ్రిమెంట్​దిశగానూ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఆ సంస్థకు దాని గురించిన లోటుపాట్లు తెలిసుంటాయని, ఈ నేపథ్యంలోనే ఆ పాత ఏజెన్సీ అయిన ఎల్​ అండ్​ టీతోనే ప్రొవిజనల్ అగ్రిమెంట్​ చేసుకుని ముందుకు వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలోనూ ఉన్నట్టు చెబుతున్నారు. 

పునాదుల కింద గుల్లే.. 

కాళేశ్వరం బ్యారేజీల సేఫ్టీని తేల్చేందుకు ఇటీవల ఎన్‌‌‌‌‌‌‌‌జీఆర్‌‌‌‌‌‌‌‌ఐ, సీడబ్ల్యూపీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ శాస్త్రవేత్తలు అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. మేడిగడ్డ 7వ బ్లాక్‌‌‌‌‌‌‌‌లో రాఫ్ట్ కింద భారీ ఎత్తున ఇసుక కొట్టుకుపోయి గుల్లలు ఏర్పడినట్లు జీపీఆర్ టెస్టులు స్పష్టం చేశాయి. సీకెంట్​పైల్స్ నిర్ణీత లోతు వరకు లేకపోవడం వల్లే నీరు కింద నుంచి లీకై ఇసుకను కొట్టుకుపోయేలా చేసిందని తేలింది.

పియర్ 19, 20, 21 పరిసరాల్లో రాఫ్ట్ కింద ఖాళీలు విస్తరించినట్లు గుర్తించారు. అన్నారంలో నిర్వహించిన జీపీఆర్ పరీక్షల్లోనూ అప్రాన్ కింద, కాంక్రీట్ బ్లాకుల కింద ఇసుక భారీగా కదిలిపోయినట్లు బయటపడింది. లీకేజీలు విపరీతంగా ఉండడంతో పునాదుల స్థిరత్వం దెబ్బతిన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సుందిళ్ల బ్యారేజీ అప్రాన్, కొన్ని నిర్దిష్ట బ్లాకుల కింద జీపీఆర్ రాడార్ తరంగాలు కావిటీలు ఉన్నట్లు సంకేతాలిచ్చాయి. పైన కాంక్రీట్ పటిష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఇసుక కోతకు గురై బోలుగా మారినట్లు తేలిందని చెబుతున్నారు.  


అన్నారం, సుందిళ్లకు మరో రూ.200 కోట్లు!

మేడిగడ్డ పరిస్థితి ఇలా ఉంటే.. మిగిలిన రెండు బ్యారేజీలైన అన్నారం, సుందిళ్ల మరమ్మతులకు కూడా భారీగానే ఖర్చు అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. సీపేజీలు, ఇసుక కోత, అప్రాన్ డ్యామేజ్‌‌‌‌‌‌‌‌లు సరిదిద్దేందుకు, అదనపు రక్షణ గోడలు, గ్రౌటింగ్ పనులకు రూ.200 కోట్ల దాకా అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.

ఈ రెండు బ్యారేజీలకు సంబంధించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మేడిగడ్డ లాంటి ఉపద్రవమే ముంచుకొచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ మూడు బ్యారేజీలను వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి రిపేర్లు చేసి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకు అనుగుణంగానే పనులు చేయిస్తున్నది. అసెంబ్లీలోనూ ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఇదే విషయం చెప్పారు.