- నివేదిక ఇవ్వాలని ఆదేశించిన మీనాక్షి నటరాజన్
- లెక్కలు తీసే పనిలో గాంధీ భవన్ వర్గాలు
- తమకు ప్రాధాన్యం ఉంటుందన్న ఆశలో ‘అసలు’ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్, వెలుగు: పీసీసీలో ఇప్పుడు పాత.. కొత్త పంచాయితీ నడుస్తోంది. కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న వారిని పక్కనపెడుతూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారనే ఫిర్యాదులు హైకమాండ్ కు పెద్ద ఎత్తున చేరాయి. దీంతో అసలు ఈ రెండున్నరేండ్లలో అసలు కాంగ్రెస్ నేతలకు ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చాం? వలస నేతలకు ఎన్ని పదవులు ఇచ్చాం? లెక్కలు తీయాలని పీసీసీ నాయకత్వాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశించారు.
ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ జూమ్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఆయా జిల్లాల నుంచి పలువురు సీనియర్ నేతలు.. నామినేటెడ్ పదవుల్లో సీనియర్లకు జరుగుతున్న అన్యాయంపై, వలస నేతలకు దక్కుతున్న ప్రాధాన్యతపై ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో దీనిపై లెక్కలు తీయాలని పీసీసీ నాయకత్వాన్ని ఆమె ఆదేశించారు.
ఇతర పార్టీల్లోంచి వచ్చినోళ్లకు పదవులు
కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి అసలు కాంగ్రెస్ వాళ్లకు కాదని, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు ఇచ్చారని మీనాక్షికి ఫిర్యాదులు అందాయి. ఇదే పరిస్థితి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉందని ఆమెకు వరుస ఫిర్యాదులు రావడంతో దీనిపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో అసలు కాంగ్రెస్ నేతలకు, వలస నేతలకు ఎవరికి ఎన్ని పదవులు వచ్చాయో లెక్కలు తీసే పనిలో పీసీసీ నాయకత్వం ఉంది. దీని ఆధారంగా త్వరలో ప్రకటించనున్న మరిన్ని నామినేటెడ్ పదవుల్లో పాత నేతలకు ప్రాధాన్యత ఉంటుందనే ఆశలో సీనియర్ నేతలు ఉన్నారు.
అయితే, సీఎం రేవంత్ రెడ్డి తనతో వచ్చిన పలువురు టీడీపీ నేతలకు, తన అనుచరులకు నామినేటెడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అసలు కాంగ్రెస్ నేతలను ఆయన కావాలనే పక్కన పెడుతున్నారనే ఫిర్యాదులు గాంధీ భవన్ కు చేరుతున్నాయి. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీ వీడిన తీరును ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రకటించనున్న నామినేటెడ్ పదవుల్లో మీనాక్షి నటరాజన్ మార్క్ ఏ మేరకు కనిపించనుందో అనే చర్చ గాంధీ భవన్ లో సాగుతోంది.
