క్యూర్ పరిధిలోని ఫ్లై ఓవర్ల కింద ఫుడ్ కోర్టులు, పార్కింగ్ లాట్లు..

క్యూర్ పరిధిలోని  ఫ్లై ఓవర్ల కింద  ఫుడ్ కోర్టులు, పార్కింగ్ లాట్లు..
  •  చెత్త, బిచ్చగాళ్లతో   నిండిపోతున్న ఫ్లై ఓవర్లు  
  •  మార్చడంతో పాటు ఆదాయం పెంపునకు హుమ్టా ప్లాన్​
  •  ముందుగా తెలంగాణ తల్లి,  బేగంపేట ఫ్లై ఓవర్ల ఎంపిక ? 

హైదరాబాద్​సిటీ, వెలుగు : క్యూర్​పరిధిలోని ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్​ కారిడార్ల కింద ఉన్న ఖాళీ స్థలాలు చెత్తా చెదారంతో నిండిపోవడం, బిచ్చగాళ్ల ఆవాసాలుగా మారుతుండడం, తాగుబోతులకు అడ్డాగా మారుతుండడంతో హైదరాబాద్​అర్బన్​మెట్రోపాలిటన్​డెవలప్​మెంట్​అథారిటీ (హుమ్టా) కొత్త ప్లాన్​వేసింది. వాటి రూపు రేఖలు మార్చడంతో పాటు ఆదాయం పెంచుకునేందుకు పాత్​వే, పార్కింగ్​లాట్లు, ఫుడ్​కోర్టులు, గార్డెనింగ్, ఇతర సౌకర్యాలు కల్పించాలని చూస్తోంది. ముందుగా తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్​, బేగంపేట ఫ్లై ఓవర్లను ఎంపిక చేసి మార్చి చూడాలని అనుకుంటున్నారు. ఇక్కడ సక్సెస్​అయితే, సిటీలోని మిగిలిన ఫ్లై ఓవర్లను డెవలప్​చేయనున్నారు.  

పాత్​వేలు,  సైక్లింగ్​ ట్రాక్స్ కూడా.. 

ఏమేం ఏర్పాటు చేస్తారంటే..

నగరంలో గుర్తించిన ఫ్లై ఓవర్ల కింద వాకర్స్​కు పాత్​వే, సైక్లింగ్​ట్రాక్స్, ఆహ్లాదంగా కనిపించడానికి అందమైన పూలమొక్కలు, చెట్లు కూడా నాటుతారు. మరికొన్ని చోట్ల చిన్న చిన్న పార్కులు, రిక్రియేషనల్​ఏరియాలుగా డెవలప్​చేస్తారు. అవకాశమున్న చోట్ల పెయిడ్​పార్కింగ్, వెండింగ్​ జోన్స్ నిర్మిస్తారు. ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఓపెన్​జిమ్ ఏర్పాటు చేయడం, స్పోర్ట్స్​ఫెసిలిటీస్​ కల్పించడంపై దృష్టి పెడతారు. షాపులను నిర్మించి అద్దెకివ్వడం, మల్టీ స్ర్కీన్​డిస్​ప్లే బోర్డులు ఏర్పాటు చేసి అడ్వర్టైజ్​మెంట్ల ద్వారా స్థానిక సంస్థలకు కూడా ఆదాయం వచ్చేలా చేయనున్నారు. 

అలాగే, ఫుడ్ ​కోర్టులు కూడా ఏర్పాటు చేసి జనం ఎక్కువగా వచ్చేలా చేయనున్నారు. స్థానికుల అవసరాల మేరకు బస్తీ దవాఖానాలు కూడా  ఏర్పాటు చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఈ పనులను ముందుగా బేగంపేట, తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ల కింద చేయాలని అనుకుంటున్నారు. కావాల్సిన డబ్బులను పబ్లిక్​అండ్​ప్రైవేట్​ పార్ట్​నర్​షిప్​ ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ ప్లాన్ల అమలుకు త్వరలో కన్సల్టెంట్​ను నియమించనున్నారు. వారు టెక్నికల్, ఫైనాన్షియల్, పబ్లిక్​ బెనిఫిట్, ఇంప్లిమెంటేషన్​ కాస్ట్​, ఆదాయ మార్గాలపై నివేదిక ఇవ్వనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సదరు కన్సల్టెన్సీ సంస్ధ డీపీఆర్​ను ఇచ్చిన తర్వాత ఈ ప్రణాళికలను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. 

పచ్చదనం సక్సెస్​కాలే.. 

సిటీలో చాలా చోట్ల ఫ్లై ఓవర్ల కింద పచ్చదనం పేరుతో చెట్లు నాటినా అవి నిర్వహణ లేని కారణంగా అధ్వానంగా తయారువుతున్నాయి. మరికొన్ని చోట్ల బిచ్చగాళ్ల, తాగుబోతుల షెల్టర్లుగా మారుతున్నాయి. కొన్ని చోట్ల స్థానిక వ్యాపారులు, ఫుట్ పాత్​ వ్యాపారులు పార్కింగ్​ప్లేస్​లుగా వాడుకుంటున్నారు. ఇంకొందరు గోదాములుగా ఉపయోగించుకుంటున్నారు.