సర్ ప్రక్రియ చాలా స్లో.. సగం కూడా పూర్తి కాలేదు..గడువు పెంచాలంటూ డిమాండ్లు

సర్ ప్రక్రియ  చాలా స్లో.. సగం కూడా పూర్తి కాలేదు..గడువు పెంచాలంటూ డిమాండ్లు
  • మరో 10 రోజుల్లో ముగియనున్న గడువు
  • హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో డెడ్ ​స్లో
  • కోటికిపైగా ఓటర్లు.. 28.46 లక్షలే ఎంట్రీ
  • నత్తనడకన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 
  • గడువు పొడిగించాలని డిమాండ్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్​ రివిజన్(సర్) ప్రక్రియలో భాగమైన డిజిటలైజేషన్  నెమ్మదిగా సాగుతోంది. గత నెల  25న ప్రారంభమైన ఈ  డ్రైవ్ ఈ నెల 24తో ముగుస్తుండగా.. ఇప్పటివరకూ సగం మంది ఓటర్ల వివరాలు కూడా డిటిటలైజేషన్‌‌‌‌ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3 కోట్ల38 లక్షల26 వేల 448 మంది ఓటర్లలో కేవలం కోటీ 66 లక్షల 70 వేల 610 మంది(కేవలం 49.28 శాతం ) వివరాలు మాత్రమే ఇప్పటివరకు డిజిటలైజ్ అయ్యాయి. 

రాష్ట్రవ్యాప్తంగా 100  శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెప్తున్నా.. వాటిని ఆన్‌‌‌‌లైన్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓటర్లు రాసిన అడ్రస్‌‌‌‌లు  సరిగ్గా లేకపోవడం, క్షేత్రస్థాయి పరిశీలనలో పేర్లు మ్యాచ్ కాకపోవడంలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో 2002 నాటి పాత ఓటర్ల వివరాలు లభ్యం కాకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. సర్వర్ డౌన్ కావడం, లాగిన్ సమస్యలలాంటి సాంకేతిక లోపాలు కూడా తోడవ్వడంతో ప్రక్రియ ఆలస్యంగా నడుస్తోందని అధికారులు చెప్తున్నారు.   

జిల్లాలవారీగా ఇలా..  

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల పరిధిలో అత్యధికంగా దాదాపు కోటికిపైగా మంది ఓటర్లు ఉండగా, అందులో కేవలం 28.46 లక్షల మంది వివరాలు మాత్రమే ఇప్పటివరకూ ఆన్‌‌‌‌లైన్ అయ్యాయి. వలసలు ఎక్కువగా ఉండడం, కొన్ని ఇండ్లకు తలుపులు, తాళాలు వేసి ఉండడం, గేటెడ్ కమ్యూనిటీల్లో బీఎల్ఓలకు అడ్రస్‌‌‌‌లు దొరకకపోవడం, యాప్‌‌‌‌లో సాంకేతిక సమస్యల వల్లే ‘సర్’​ ప్రక్రియ వెనుకబడినట్టు తెలుస్తోంది.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా ఉన్న అర్బన్​ ఏరియాల్లో ‘సర్’​ ప్రక్రియ వెనుకబడడం ఎన్నికల యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.. రాష్ట్రంలోనే అత్యల్పంగా కేవలం 18.73 శాతం డిజిటైజేషన్‌‌‌‌‌‌‌‌తో ఆఖరి స్థానంలో నిలవగా, ఇక్కడి 29.76 లక్షల మంది ఓటర్లలో కేవలం 5.57 లక్షల మంది వివరాలు మాత్రమే డిజిటలైజేషన్‌‌‌‌‌‌‌‌కు నోచుకున్నాయి. 

మరోవైపు అత్యధికంగా 47.36 లక్షల మంది ఓటర్లు ఉన్న రాజధాని హైదరాబాద్ జిల్లాలో కేవలం 10.52 లక్షల ఓటర్ల వివరాలు(22.22 శాతం ) మాత్రమే ఎంట్రీ అయ్యాయి.  36.98 లక్షల ఓటర్లు ఉన్న రంగారెడ్డి జిల్లాలో సైతం కేవలం 12.36 లక్షల(33.43 శాతం ) మంది వివరాలు మాత్రమే డిజిటలైజ్‌‌‌‌‌‌‌‌​కావడం గమనార్హం.  ఇక యాదాద్రి భువనగిరి జిల్లా.. ఏకంగా 79.86 శాతం డిజిటలైజేషన్‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

 ఆ తర్వాతి స్థానాల్లో నల్గొండ జిల్లా (73.11 శాతం), సిద్దిపేట జిల్లా (72.11 శాతం)తో ఉత్తమ పనితీరు కనబరిచాయి. వీటితోపాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ (70.79%), నిజామాబాద్ (70.22%) , రాజన్న సిరిసిల్ల (69.86%) జిల్లాలు కూడా ముందంజలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే ఈ జిల్లాల్లో ఓటర్ల అడ్రస్‌‌‌‌‌‌‌‌లు సులువుగా దొరకడం, క్షేత్రస్థాయిలో బీఎల్ఓల సమన్వయం, ఓటర్ల నుంచి స్పందన మెరుగ్గా ఉండటమే ఈ జిల్లాల టాప్ పర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌కు కారణమని స్పష్టమవుతోంది.

ఎన్యూమరేషన్​ ఫారం ఇవ్వకపోతే ఓట్లు ఉండవు: సీఈవో

సర్​ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాలను తక్షణమే పూర్తి చేసి బీఎల్ఓలకు అందజేయాలని సీఈవో  సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు . తద్వారా ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. బీఎల్‌‌‌‌‌‌‌‌ఓలు పంపిణీ చేసిన ఫారాల్లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా పూరించి, దానిపై లేటెస్ట్ పాస్​పోర్ట్ సైజ్​ ఫొటోను అతికించి సమర్పించాలని సూచించారు. 

ఈ ఎన్యూమరేషన్ ఫారంలో తప్పనిసరిగా ఓటరు సంతకం  తేదీతోపాటు సంబంధిత బీఎల్ఓ సంతకం కూడా ఉండేలా చూసుకోవాలని సీఈవో స్పష్టం చేశారు. అధికారులు ఓటర్లకు అందజేసిన రెండు ఫారాలలో ఒకదానిని నింపి బీఎల్ఓకు ఇవ్వాలని, రెండో ఫారాన్ని ఓటర్లు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలన్నారు. పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు సకాలంలో అందజేస్తేనే.. రాబోయే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఓటరు పేరు నమోదు అవుతుందని ఆయన తెలిపారు.  2002 నాటి ఓటరు జాబితాలో మీ   వివరాలు ఉంటే ఆ పాత వివరాలను ఫారంలో తప్పనిసరిగా నమోదు చేయాలని, ఒకవేళ ఆ వివరాలు లేకపోయినా ప్రస్తుత వివరాలతోనే ఫారాన్ని పూర్తి చేసి బీఎల్ఓలకు ఇవ్వవచ్చని స్పష్టంచేశారు.  

సర్​.. గడువు పొడిగించండి

సీఈవోకు మంత్రి పొన్నం, కాంగ్రెస్​, బీఆర్ఎస్​ నేతల విజ్ఞప్తి

రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నందున గడువు పొడిగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎమ్మెల్యేలు  శ్రీగణేశ్, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఇతర కాంగ్రెస్​ నేతలు సీఈవోను కలి శారు. చాలాచోట్ల బీఎల్‌‌‌‌‌‌‌‌ఓలు ఇంకా ఓటర్ల ఇండ్లకు వెళ్లి ఫారాలు ఇవ్వలేదని, డిజిటలైజేషన్ సైతం​ స్లోగా సాగుతోందన్నారు. 

10 రోజుల గడువు ఎటూ చాలదని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో 21% ప్రక్రియ మాత్రమే పూర్తయిందని, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని పొన్నం వివరించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అవసరమైతే సర్ ప్రక్రియలో విద్యార్థుల సాయం తీసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరునూ జాబితా నుంచి తొలగించకుండా చూడాలని కోరారు. 

కాగా, సీఈవో సుదర్శన్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని బీఆర్​ఎస్​ పార్టీ ఎస్​ఐఆర్​ కో ఆర్డినేషన్​ కమిటీ సభ్యులు కర్నె ప్రభాకర్​, ఎల్. రమణ, సుమిత్రా ఆనంద్​, సతీశ్​ రెడ్డి, అభిలాష్​ రంగినేని కలిశారు. బీఎల్​వోలు క్షేత్రస్థాయిలో పనిచేసేలా చొరవ తీసుకోవాలని కోరారు సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమయం సరిపోదని, గడువు పొడిగించాలని డిమాండ్​ చేశారు.