
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంచె గచ్చిబౌలి భూవివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ కమిటీతో శనివారం (ఏప్రిల్ 5) ఆమె భేటీ అయ్యారు. కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆమె చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.
గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో అన్ని అంశాలు చర్చిస్తున్నామని.. ఏకపక్షంగా కాకుండా అందరి వాదనలు వింటామని తెలిపారు. ఆ తర్వాత గచ్చిబౌలి భూములపై ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరికీ నష్టం జరగకుండా వివాదం పరిష్కరించాలనేది మా ఆలోచన అని.. వర్శిటీ విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు.
కాగా, హైచ్సీయూ వర్శిటీకి అనుకుని ఉన్న కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై తీవ్ర వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. చట్టం ప్రకారం ఈ భూమి ప్రభుత్వానిదే అయినప్పటికీ.. లేదు ఇది వర్శిటీ భూమి అంటూ హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. విద్యార్థుల ప్రొటెస్ట్ కు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడంతో గచ్చిబౌలి భూవివాదం పొలిటికల్ టర్న్ తీసుకుని తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు గచ్చిబౌలి భూముల వివాదం తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుకు చేరింది. కంచె గచ్చిబౌలి భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని పిటిషనర్లు కోర్టుల్లో సవాల్ చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానాలు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు గచ్చిబౌలి భూముల్లో ఎక్కడి పనులు అక్కడే ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కంచె గచ్చిబౌలి భూముల్లో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
ఈ భూవివాదం తీవ్ర వివాదస్పదంగా మారడం కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను రంగంలోకి దించింది. హైకమాండ్ ఆదేశాలతో ఏప్రిల్ 5న హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్ హెచ్ సీయూ భూముల వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ కమిటీతో పాటు కాంగ్రెస్ అనుబంధ విభాగం ఎన్ఎస్యూఐ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గచ్చిబౌలి భూవివాదం గురించి సుదీర్ఘంగా చర్చించారు.