V6 News

జూన్ 2కల్లా పీఆర్సీ అమలు చేయాలి.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

జూన్ 2కల్లా పీఆర్సీ అమలు చేయాలి.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నిరసన
  • రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి
  • ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి
  • టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ రాజశేఖర్​ డిమాండ్​
  • అన్ని జిల్లాల్లో అధికారులకు ఉద్యోగుల వినతి పత్రాలు

హైదరాబాద్, వెలుగు: జూన్ 2 కల్లా పీఆర్సీ అమలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయడం తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వఉద్యోగులు నిరసన తెలిపారు. మండల, డివిజన్​ కేంద్రాలతో పాటు సెక్రటేరియెట్​ఎదుట ధర్నా చేసి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్​ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ క‌‌‌‌‌మిటీ  చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల  రాజశేఖర్ ఆధ్వర్యంలో జేఏసీలోని భాగస్వామ్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ ఆర్డీఓ కె.రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి కొనసాగిస్తామని, ఇందులో భాగంగానే శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మండల, డివిజన్ కేంద్రాల్లో టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలను సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వం జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్  క్లియర్ చేయాలని కోరారు.

హెల్త్ స్కీమును తక్షణమే అమల్లోకి తేవాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్ బిల్లులతో పాటు పెండింగ్ డీఏలను కూడా విడుదల చేయాలన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 ఏండ్లు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు లచ్చిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ భాగస్వామ్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హన్మంతరావు, నిర్మల, దర్శన్ గౌడ్, కుమార్, ఉపేందర్ రావు, చంద్రశేఖర్ గౌడ్, హబీబ్ మియా, కృపాకర్ రెడ్డి, మొయినుద్దీన్, సీహెచ్ లక్ష్మయ్య, రాములు, రమేశ్​పాక పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జీలతో నిరసన
జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీలు చేపట్టారు. హైదరాబాద్ లో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం  లంచ్ బ్రేక్ లో సెక్రటేరియెట్​లోని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సెక్రటేరియెట్​బయట ర్యాలీ తీశారు. 

హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర, అబిడ్స్ లోని భీమా భవన్ దగ్గర ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రెండో  పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి 30 నెలలు అవుతున్నా ఇంత వరకు ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించుకోలేదని విమర్శించారు.

జూన్ 2 లోగా రిపోర్ట్ తెప్పించుకొని 51 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్లు పాల్గొన్నారు. టీఎస్ సీపీఎస్ ఈయూ ఆధ్వర్యంలో  సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 

హైదరాబాద్‌‌లోని బీమా భవన్ వద్ద జరిగిన ‘లంచ్ అవర్’ నిరసనలో రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ పాల్గొని  మాట్లాడారు. వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ ​చేశారు.