- 70 లక్షల భూమిని ఎలా 21 లక్షలకే ధారాదత్తం చేస్తారు.?
- బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి
- సీబీఐ విచారణ జరపాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు లేఖ
హైదరాబాద్, వెలుగు: మెగాఫుడ్ పార్క్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మార్చేసిందని బీజేపీ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయల నిధులను పక్కదారి పట్టిస్తూ, కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించేందుకు కేంద్రం బుగ్గపాడు మెగాఫుడ్ పార్క్‌ను మంజూరు చేస్తే రేవంత్ సర్కార్ దాన్ని ప్రైవేట్ సంస్థల జేబులు నింపే సాధనంగా మార్చిందని పొంగులేటి విమర్శించారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.70 లక్షల నుంచి 80 లక్షలు పలుకుతుంటే, దీపక్ నెక్స్ట్ జెన్ఫుడ్స్ అనే సంస్థకు కేవలం రూ. 21 లక్షలకే 72 ఎకరాలను ఎలా ధారాదత్తం చేశారని ప్రశ్నించారు. ఈ చీకటి ఒప్పందాల వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ప్రజలకు చెప్పాలన్నారు.
వెంటనే ఈ వివాదాస్పద టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. సింగరేణి లెక్కల ప్రకారం 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, రవాణా అయింది కేవలం 65.23 మిలియన్ టన్నులేనని.. మరి మిగిలిన సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దోపిడీపై సీబీఐ, కేంద్ర విజిలెన్స్ కమిషన్ సమగ్ర విచారణ జరిపించాలని పొంగులేటి డిమాండ్ చేశారు. భూ కేటాయింపులు, బొగ్గు మాయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
