నాకు మగధీరలా.. రోషన్‌కు ఛాంపియన్‌: రామ్ చరణ్

నాకు మగధీరలా.. రోషన్‌కు ఛాంపియన్‌: రామ్ చరణ్

 

రోషన్, అనస్వర రాజన్‌ జంటగా ప్రదీప్ అద్వైతం రూపొందించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మించాయి. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది.  గురువారం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది.  ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్‌ మాట్లాడుతూ ‘మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో పాటు నా మొదటి చిత్రాన్ని నిర్మించి, మెమొరబుల్‌ జర్నీని ఇచ్చిన అశ్వనీదత్‌ గారికి, వైజయంతి సంస్థకు మరొకసారి ధన్యవాదాలు చెబుతున్నా.  ఇదే బాటలో ఇప్పుడు రోషన్‌కు కూడా గొప్ప విజయం రావాలని ఆశిస్తున్నా. చిన్నప్పటినుంచి రోషన్ బాగా తెలుసు. 

ఈ మూవీ పోస్టర్స్‌ లో తను ఓ హాలీవుడ్ హీరోలా, యూరోపియన్‌ సినిమా యాక్షన్ హీరోలా చాలా అందంగా ఉన్నాడు.  స్క్రీన్‌పై రోషన్ చాలా మెచ్యూర్డ్‌ గా కనిపించాడు. అనస్వరకు ఈ సినిమా తర్వాత అవకాశాలు ఇస్తామంటూ వరుస కాల్స్ వస్తాయి.  తన ఫేస్‌ చాలా కళగా ఉంది. దర్శకుడు ప్రదీప్‌ నటీనటులను చాలా మోల్డ్‌ చేశారు. సినిమా విజువల్స్ చూస్తుంటే ‘లగాన్‌’ సినిమా యాక్షన్‌ ఓరియంటెడ్‌గా తీసినట్టు, ఓ క్లాసిక్‌లా కనిపిస్తోంది. నాకు రెండో చిత్రం ‘మగధీర’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో రోషన్‌కు ‘ఛాంపియన్‌’ అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. స్వప్న, ప్రియాంక వైజయంతి మూవీస్‌ లెగసీని కొనసాగిస్తున్నారు. అవకాశం ఉంటే ఈ బ్యానర్‌‌లో నేను కూడా మళ్లీ వర్క్ చేయాలి అనుకుంటున్నా’ అని చెప్పారు.  హీరోహీరోయిన్స్‌ రోషన్, అనస్వర,  దర్శకుడు నాగ్ అశ్విన్‌,  నిర్మాతలు అశ్వినీదత్,  స్వప్నదత్, ప్రియాంక దత్, జెమినీ కిరణ్, నటుడు శ్రీకాంత్ సహా మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.