Chiranjeevi: చరణ్‌ను చూసి గర్వపడుతున్నా.. 'పెద్ది' సక్సెస్ వేడుకలో మెగాస్టార్ ఎమోషనల్!

Chiranjeevi: చరణ్‌ను చూసి గర్వపడుతున్నా.. 'పెద్ది' సక్సెస్ వేడుకలో మెగాస్టార్ ఎమోషనల్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో తెరకెక్కించిన'పెద్ది' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. చరణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, యావత్ చిత్రయూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

వేదికపై తండ్రీకొడుకుల అల్లరి..

ఈ వేదికపై చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్‌ను గట్టిగా హగ్ చేసుకుంటూ.. కాసేపు కిలికిలింతలు పెట్టి ఆటపట్టించారు. నాన్న అల్లరి నుంచి తప్పించుకోవడానికి చరణ్ నవ్వుతూ ప్రయత్నించడం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మెగా ఫాదర్, సన్ మధ్య అరుదుగా కనిపించే ఈ క్యూట్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ కేరింతలతో థియేటర్ హోరెత్తిపోయింది..

 

చిరు ఎమోషనల్ స్పీచ్

నేను ఇక్కడికి ఒక గెస్ట్‌లా రాలేదు.. సినిమాను ప్రాణంగా ప్రేమించే మీలో ఒకడిగా వచ్చాను అని చిరంజీవి అన్నారు.. దశాబ్దాలు మారుతున్నా మా మెగా అభిమానుల క్రమశిక్షణ, ప్రేమ అస్సలు మారలేదు. 'పెద్ది' లాంటి సినిమాలు ఇండస్ట్రీని మరింత బలోపేతం చేస్తాయి. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించిన ఘనత ఈ చిత్రానిదే అని చిరంజీవి భావోద్వేగంగా మాట్లాడారు. తన కొడుకు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ.. నటుడిగా చరణ్ ప్రతి సినిమాకు పరిణతి చెందుతున్నాడని, ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం తనకు గర్వంగా ఉందన్నారు.

 

'పెద్ది' నా లైఫ్‌ను మార్చేసింది

 ఈ సినిమా నా లైఫ్‌ను మార్చేసిందంటూ రామ్ చరణ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మూవీలోని పాటలకు ప్రేక్షకులు థియేటర్లలో డాన్స్ చేస్తుంటే నా గుండె గర్వంతో నిండిపోతోంది. ఇప్పుడు నా కూతురు క్లీంకార కూడా నన్ను చూసి 'పెద్ది' అని పిలుస్తోంది. రేపు మీరందరూ కూడా నా అసలు పేరు మర్చిపోయి 'పెద్ది' అని పిలుస్తారేమో అంటూ నవ్వేశారు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు మీ రామ్ చరణ్ ఎప్పటికీ రుణపడి ఉంటాడని చెప్పారు. నాన్నతో నేరుగా మాట్లాడలేని విషయాలు ఏవైనా ఉంటే.. నా గాడ్‌ఫాదర్, దర్శకుడు సుకుమార్‌కు ఫోన్ చేసి చెప్తాను అని చరణ్ ఎమోషనల్ అయ్యారు.

 

బుచ్చిబాబు మార్క్.. 

'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ విలేజ్ డ్రామా, సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలతో అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించింది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చిత్ర యూనిట్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.