వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. E20 పెట్రోల్‌తో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు ఎలాంటి ఢోకా లేదు

వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. E20 పెట్రోల్‌తో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు ఎలాంటి ఢోకా లేదు

ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్(E20) వాడకంపై గత కొన్ని రోజులుగా వాహనదారుల్లో నెలకొన్న అతిపెద్ద ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు రావని, ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరిస్తాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది. ఈ ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని, వాహనదారుల ఇన్సూరెన్స్ హక్కులకు ఎలాంటి ముప్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటికే ఆయా సంస్థలతో చర్చించామని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది.

ఇథనాల్ బ్లెండింగ్ అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాలేదని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన అత్యంత సురక్షితమైన విధానమని కేంద్రం గుర్తుచేసింది. అమెరికా, జపాన్ తో పాటు బ్రెజిల్ వంటి దేశాల్లో ఎన్నో ఏళ్లుగా దీనిని విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా బ్రెజిల్‌లో ఎప్పటి నుంచో 'E27' పెట్రోల్ ఉందని వివరించింది. కాబట్టి భారతీయ వాహనదారులు ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.

దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఎంతో మేలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం వివరించింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఈ కార్యక్రమం వల్ల భారతదేశానికి ఇప్పటివరకు ఏకంగా రూ.లక్షా 40వేల కోట్లకు పైగా ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆదా అయిందని పేర్కొంది. కేవలం దేశానికే కాకుండా.. ఇథనాల్ తయారీకి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వల్ల దేశీయంగా రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తోందని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈ నిర్ణయం పెద్ద ఊతాన్ని ఇస్తోందని ప్రభుత్వం తెలిపింది.

►ALSO READ | న్యూక్లియర్ పవర్ తయారీలోకి అదానీ ఎంట్రీ.. AI రంగంపై ఫోకస్

భారతదేశ ఇంధన భద్రతను పెంపొందించడంలో, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో.. స్వచ్ఛమైన ఇంధన రవాణా వైపు అడుగులు వేయడంలో ఇథనాల్ బ్లెండింగ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శాస్త్రీయ ఆధారాలు, నిరంతర పరిశోధనలు, భాగస్వామ్య పక్షాల సమన్వయంతోనే ఈ కార్యక్రమం ముందుకు సాగుతోందని పునరుద్ఘాటించింది. భవిష్యత్తులో కూడా వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని కేంద్రం వెల్లడించింది. దీనితో వాహనదారుల ఇన్సూరెన్స్ భయాలకు పూర్తిగా తెరపడినట్లయింది.