న్యూక్లియర్ పవర్ తయారీలోకి అదానీ ఎంట్రీ.. AI రంగంపై ఫోకస్

న్యూక్లియర్ పవర్ తయారీలోకి అదానీ ఎంట్రీ.. AI రంగంపై ఫోకస్

Adani AGM 2026: గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన పుట్టినరోజు కంపెనీ ఏజీఎంలో కీలక సమావేశంలో ప్రసంగించారు. భారతదేశ భవిష్యత్తును మార్చేసే రోడ్‌మ్యాప్‌ను ప్రపంచం ముందుంచారు. న్యూక్లియర్ పవర్, AI, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పన అనే మూడు ప్రధాన స్తంభాలపై అదానీ గ్రూప్ తన సరికొత్త సామ్రాజ్యాన్ని నిర్మించబోతోందని గౌతమ్ అదానీ ప్రకటించారు. అదానీ గ్రూప్ ఏకీకృత ఆదాయం 7.4 శాతం పెరిగి రూ. 2లక్షల 92వేల కోట్లకు చేరింది. పన్నుల తర్వాతి లాభం 14 శాతం వృద్ధితో రూ.46వేల 376 కోట్లకు చేరుకుందని వెల్లడించారు.

గత ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ చుట్టూ ఎన్నో వివాదాలు, తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వాటన్నింటినీ తట్టుకుని మునుపెన్నడూ లేనంత బలంగా నిలబడ్డామని, అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనే తాము ఈ అద్భుతమైన వృద్ధిని సాధించామని వాటాదారులకు గౌతమ్ అదానీ గర్వంగా ప్రకటించారు. ఈ ఏజీఎంలో అందరినీ ఆశ్చర్యపరిచిన అతిపెద్ద ప్రకటన అణుశక్తి రంగంలోకి అదానీ గ్రూప్ అధికారిక ఎంట్రీ ఇవ్వడం. 'అదానీ అటామిక్ ఎనర్జీ' ద్వారా గ్రూప్ అణు విద్యుత్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఇప్పటికే భూమిని కూడా గుర్తించామని.. 2035 నాటికి 10 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అదానీ వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలకు, డేటా సెంటర్ల విస్తరణకు నిరంతరాయంగా క్లీన్ ఎనర్జీని అందించడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక అడుగు పడిందన్నారు.

►ALSO READ | అమెరికా ఫెడ్ దెబ్బకు కుదేలైన బంగారం, వెండి.. ఇప్పుడు కొనాలా? వద్దా?

దేశ ప్రగతికి మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమో, సాంకేతిక ఆధిపత్యానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే ముఖ్యమని అదానీ స్పష్టం చేశారు. "ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దేశానికి కండబలాన్ని ఇస్తే.. ఇంటెలిజెన్స్ దేశానికి విశ్వవిజేతగా నిలిచే మేధోబలాన్ని ఇస్తుంది" అంటూ అదానీ చెప్పిన మాటలు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా 2030 నాటికి 3 గిగావాట్ల డేటా సెంటర్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నంలో గిగావాట్ స్థాయి డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం గూగుల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

పవర్ సెక్టార్‌లో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ విస్తరణ కార్యక్రమాన్ని అదానీ పవర్ చేపట్టింది. వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులతో 45 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే భూటాన్ దేశానికి చెందిన డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్‌తో కలిసి 5,000 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టులను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది.

లాజిస్టిక్స్ మరియు రవాణా రంగాల్లో కూడా అదానీ పోర్ట్స్ 500 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఏవియేషన్ రంగంలో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం నాలుగేళ్లలోనే రికార్డు సమయంలో పూర్తయిందని, ఇది ఏడాదికి 90 మిలియన్ల ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదని అదానీ తెలిపారు. డిఫెన్స్ రంగంలో కూడా లియోనార్డో, ఎంబ్రాయెర్ వంటి అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలిపి దేశీయంగా హెలికాప్టర్లు, యుద్ధ విమానాల తయారీని వేగవంతం చేశామని, 'ఆపరేషన్ సింధూర్' సమయంలో భారత సాయుధ దళాలకు అదానీ డ్రోన్లు, మిస్సైళ్లు ఎంతగానో ఉపయోగపడ్డాయని గుర్తుచేశారు.

వ్యాపారంతో పాటు అదానీ ఫౌండేషన్ 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా అహ్మదాబాద్, ముంబైలలో 'అదానీ హెల్త్ సిటీ' క్యాంపస్‌లను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. కేవలం రాబోయే క్వార్టర్లలో లాభాల కోసమే కాకుండా.. భారతదేశ తర్వాతి తరం గ్రోత్ స్టోరీ లిఖించడమే లక్ష్యంగా అదానీ గ్రూప్ అడుగులు వేస్తోందని గౌతమ్ అదానీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.