మేఘా చీటింగ్​! రాయలసీమ లిఫ్ట్​కు తెలంగాణ మట్టి..

మేఘా చీటింగ్​! రాయలసీమ లిఫ్ట్​కు తెలంగాణ మట్టి..
  • ‘పాలమూరు–రంగారెడ్డి’ మొరం, ఇసుక, కంకరను ఏపీ ప్రాజెక్టుకు తరలించే ప్లాన్
  • ప్రైవేట్​సెక్యూరిటీ పర్యవేక్షణలో భారీ జెట్టి తయారీ
  • 6 టిప్పర్లను మోసుకెళ్లగల కెపాసిటీ దీని సొంతం
  • ఫుల్​ లోడ్​తో జెట్టిని కృష్ణా నదిలో రాత్రి, పగలు తిప్పేందుకు వ్యూహం
  • మట్టి తవ్వినందుకు మనదగ్గర.. ఎత్తుకపోయి పోసినందుకు ఏపీలో కంపెనీకి పైసలే పైసలు

నాగర్​కర్నూల్, వెలుగు: దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ఏపీ అక్రమ ప్రాజెక్టులను కడుతున్న మేఘా ఇంజనీరింగ్​ కంపెనీ.. ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు మన దగ్గరి నుంచే మట్టి ఎత్తుకపోయేందుకు ప్లాన్​ వేసింది. ఎల్లూరు పంప్​హౌస్​ సమీపంలో ఈ కంపెనీ ఓ భారీ జెట్టిని తయారు చేస్తోంది. నదిలో 180 టన్నుల బరువును ఈజీగా మోసుకెళ్లగల జెట్టిని ఫుల్​ సెక్యూరిటీ మధ్య ఎవరి కంట పడకుండా నిర్మించడం అనుమానాలకు తావిస్తోంది. ఇటు తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డి ప్యాకేజీ పనులను, అటు ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్​పనులను మేఘా కంపెనీనే చేస్తున్నది. ఈ క్రమంలో పాలమూరు ప్యాకేజీ పనుల్లో వెలికితీసిన నల్లమట్టి, మొరం, కంకర, రాళ్లతోపాటు మన వైపు ఉన్న ఇసుకను రాయలసీమ లిఫ్ట్​పనులకు తరలించేందుకే ఈ జెట్టిని తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ వైపు మెటీరియల్​ తరలించేందుకు జెట్టి తయారుచేస్తున్నట్లు చెప్తున్న కంపెనీ ఉద్యోగులు.. ఆ మెటీరియల్​ ఏమిటి? అని అడిగితే దాటవేస్తున్నారు. 

కృష్ణా నదికి ఏపీ వైపున రాయలసీమ లిఫ్ట్​ స్కీం పనులకు అవసరమయ్యే మట్టి, ఇసుక, కంకర, రాళ్లు అందుబాటులో లేవు. అదే టైంలో తెలంగాణ వైపు పాలమూరు–- రంగారెడ్డిలో భాగంగా అప్రోచ్​ కెనాల్స్, అండర్​టన్నెళ్ల తవ్వకాలతో వచ్చిన  నల్లమట్టి, కంకర, రాళ్లు గుట్టలుగా ఉన్నాయి. తెలంగాణ వైపు పెద్ద ఎత్తున ఇసుక మేటలు ఉండగా, ఏపీ వైపు ఇసుక నిల్వలు లేకుండా పోయాయి. దీంతో ఇప్పుడీ మట్టి, ఇసుక, కంకరను కృష్ణా నది ద్వారా అవతల రాయలసీమ లిఫ్టు పనులకు తరలించాలని మేఘా కంపెనీ ప్లాన్​వేసింది. ప్రస్తుతం పాలమూరు– రంగారెడ్డి పనుల స్టార్టింగ్​ పాయింట్​ అయిన నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్ గడ్డ సమీపంలోని ఎల్లూరు పంప్​హౌస్​నుంచి కృష్ణా నదిలో కేవలం 1.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్టు పనులు జరిగే చోటుకు చేరుకోవచ్చు. జెట్టి ప్రయాణమే కనుక ఫ్యుయల్  ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది. అందుకే రెడీకాగానే నీళ్లల్లో వేసేందుకు వీలుగా ఎల్లూరు అప్రోచ్​ కెనాల్​ పక్కనే ఈ  జెట్టి తయారు చేస్తున్నారు. దీనిపై 6 టిప్పర్లను ఒకేసారి తరలించే వీలు ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు. గతంలోనూ 2011లో ఏపీలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఇసుకను కొల్లాపూర్ సమీపంలోని కృష్ణానది నుంచి ఇట్లనే బోట్లు, జెట్టిల్లో తరలించారు. అప్పట్లో ఈ బోట్లను నాగర్​కర్నూల్​జిల్లాకు చెందిన  ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. అప్పటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు  ఫుల్​ సెక్యూరిటీని పెట్టి మరీ జెట్టిని తయారుచేయిస్తున్నారు. ఆఫీసర్లను, కంపెనీ వర్కర్లను  తప్ప పనులు జరుగుతున్న వైపు ఇతరులెవరినీ వెళ్లనీయడం లేదు.

పూర్తయితే.. పొద్దు, మాపు తిప్పుడే
నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణా తీరంలో మత్స్యకారులు పుట్టీలు, మరబోట్లు నడపాలంటేనే విధిగా ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్ నుంచి పర్మిషన్​ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అటవీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటిది ఫారెస్ట్​ ఆఫీసర్లకు తెలియకుండా ఇంత పెద్ద జెట్టి తయారుచేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేఘా కంపెనీ ఉద్యోగులు చెప్తున్నట్లు ఒకవేళ మెటీరియల్​ తరలించేందుకే అనుకుంటే లీగల్​గా ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ నుంచి పర్మిషన్​ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి పర్మిషన్​ తీసుకోలేదు. జెట్టి పూర్తయితే కృష్ణా నదికి ఇటువైపున ఉన్న ఎల్లూరు శివారు నుంచి అటువైపున ఏపీలో కడుతున్న రాయలసీమ ప్రాజెక్టుకు మట్టి, ఇసుక, రాళ్లను పగలు, రాత్రి తేడా లేకుండా నదిలో తరలించే చాన్స్​ ఉంది. గతంలో వెలిగోడుకు ఇక్కడి ఇసుక తరలించినప్పుడే ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జెట్టి ద్వారా ఇటు మెటీరియల్​ అటు తరలిస్తే రాజకీయ దుమారం తప్పదని, అప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియట్లేదని ఆఫీసర్లు లోలోపల మదన పడుతున్నారు.


ఆ ప్రాంతమంతా మేఘా ఆధీనంలోనే
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఫస్ట్​ ప్యాకేజీ పనులను మొదట నవయుగ కంపెనీ దక్కించుకుంది. దాదాపు సగం పనులు పూర్తయ్యాక  రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో గతేడాది మే నెలలో నవయుగ స్థానంలో మేఘా కంపెనీ టేకోవర్​ చేసింది. రూ. 4,100 కోట్లతో పంప్​హౌస్​, అప్రోచ్​ కెనాల్స్​పనులు చేస్తోంది. సేమ్​టైం ఏపీలో పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ విస్తరణ, రాయలసీమ లిఫ్ట్​ పనులు కూడా రూ. 6,820 కోట్లకు మేఘాకే దక్కాయి. కృష్ణా నదికి రెండు వైపులా భారీ కాంట్రాక్ట్​ పనులు దక్కించుకున్న ఈ కంపెనీకే ఇటీవల దెబ్బతిన్న కల్వకుర్తి ఫస్ట్​ లిఫ్ట్​ ఎల్లూరు పంప్​హౌస్​ పనులను కూడా అనధికారికంగా అప్పజెప్పారు. దీంతో నార్లాపూర్​ వద్ద పాలమూరు– రంగారెడ్డి పనులతో పాటు అప్రోచ్​ కెనాల్​ పనులు, ఎల్లూరు పంప్​హౌస్​ రిపేర్లతో దాదాపు ఈ ప్రాంతమంతా మేఘా సంస్థ ఆధీనంలోకి వెళ్లినట్లయింది. కంపెనీ ఆఫీసర్లు, ఉద్యోగులు ఇక్కడ ఏమి చేసినా చెల్లుతోంది. 

అటు.. ఇటు.. వేల కోట్లు
మన దగ్గర కెనాళ్లు, టన్నెళ్లు తవ్వినందుకు వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్న మేఘా కంపెనీ.. అదే మట్టి, కంకర, రాళ్లను మనల్ని ముంచే రాయలసీమ లిఫ్టు కోసం వాడి, అక్కడా వేల కోట్లు దండుకోబోతున్నది. 

6 టిప్పర్లు తీసుకెళ్లొచ్చు
నాగర్​కర్నూల్​ జిల్లా ఎల్లూరు అప్రోచ్​ కెనాల్​ పక్కనే మేఘా కంపెనీ తయారు చేస్తున్న జెట్టిపై 6 టిప్పర్లను ఒకేసారి తరలించొచ్చు. దీంతో నది
మీదుగా రాయలసీమ ప్రాజెక్టుకు మట్టి, ఇసుక, రాళ్లను పొద్దూ మాపు తరలించే చాన్స్​ ఉంది.