మార్చి నుంచి మెహదీపట్నంలో తేలిపోవచ్చు...! రూ. 32 కోట్లతో 340 మీటర్ల స్కైవాక్ రెడీ

మార్చి నుంచి మెహదీపట్నంలో తేలిపోవచ్చు...! రూ. 32 కోట్లతో 340 మీటర్ల స్కైవాక్ రెడీ
  • ట్రాఫిక్​ సమస్య, ప్రమాదాలకు చెక్​
  • స్కైవేపై కాఫీ షాప్​లు, స్నాక్స్​స్టాల్స్​ ఫుడ్ ​కోర్టులు కూడా.. 

హైదరాబాద్​సిటీ, వెలుగు: మెహదీపట్నం చౌరస్తాలో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న స్కైవాక్​ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. దాదాపు రెండేండ్లుగా కొనసాగుతున్న ఈ నిర్మాణం తుది దశకు చేరుకున్నది. అన్ని పనులు పూర్తయ్యాయని, కొంత కేబుల్​పనులు , ఇతర చిన్న పనులు మిగిలి ఉన్నాయని, అన్నీ కంప్లీట్​చేసి వచ్చే నెల ఆఖరు వారంలో గానీ, లేక మార్చి నెలలో గానీ అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు ప్రకటించారు. 

ఇప్పటికే ఉప్పల్​చౌరస్తాలో హెచ్ఎండీఏ నిర్మించిన స్కైవాక్​తో అక్కడ ట్రాఫిక్​ ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు స్థానికులకు ఆహ్లాదాన్ని అందించే కేంద్రంగా కూడా మారింది. దీనికంటే అధునాతనంగా మెహదీపట్నం స్కైవాక్​ను తీర్చిదిద్దారు. ఆర్చ్​ టైపులో దీనిని రూపొందించడం వల్ల చూడ్డానికి కూడా ఎంతో అందంగా కనిపిస్తోందని అధికారులు అంటున్నారు.  

స్కైవాక్​తో సమస్య పరిష్కారం..

మెహదీపట్నం నుంచి రోజూ లక్షల సంఖ్యలో వాహనాలు జర్నీ చేస్తుంటాయి. ముఖ్యంగా 1600 ఆర్టీసీ బస్సులు, వేలాది ఇతర వాహనాలు ఈ కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. మొయినాబాద్​, నార్సింగి, పరిగి, శంకర్​పల్లి, తాండూరు, వికారాబాద్​ వంటి ప్రాంతాలకు ఈ రూట్​నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, సిటీ ఆర్టీసీ ఎల్​బీనగర్​, ఉప్పల్​, చర్లపల్లి, దిల్​సుఖ్​నగర్​, హయత్​నగర్​ తదితర ప్రాంతాల నుంచి మెహదీపట్నం, గోల్కొండ ఇతర ఏరియాలకు ఈ సెంటర్​ నుంచే బస్సులను నడుపుతోంది. 

హైటెక్​సిటీ, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, కోకాపేట, నానక్​రామ్​గూడ వంటి ఐటీ హబ్​లు, ఫైనాన్షియల్​ డిస్ట్రిక్ట్‌‌ ఉన్న ప్రాంతాలకు వెళ్లడానికి మెహదీపట్నం ప్రాంతాన్నే ఉపయోగిస్తారు. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు ఇక్కడికే వస్తుంటారు. ఈ క్రమంలో ఒకవైపు నుంచి మరోవైపు రోడ్డు దాటుతూ ప్రమాదాల భారిన పడుతున్నారు. కొందరు గాయపడుతుండగా, మరికొందరు ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. సిగ్నల్స్​పట్టించుకోకుండా రోడ్డు దాటే వారితో ట్రాఫిక్​సమస్య కూడా ఉత్పన్నమవుతున్నది.  దీంతో సమస్య పరిష్కారానికి ఈ చౌరస్తాలో  హెచ్ఎండీఏ స్కైవాక్​నిర్మాణం చేపట్టింది. 

కాఫీ షాప్​లు కూడా..

ఈ స్కైవాక్​ పై 21,061.42 చదరపు అడుగుల స్థలంలో కాఫీషాప్​లు, స్నాక్స్​స్టాల్స్, ఫుడ్​కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అంతే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు, పాదచారులు ఆహ్లాదంగా కొంత సేపు గడిపేందుకు సీటింగ్​ అరేంజ్​మెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ స్కైవే పాదచారులు రోడ్డు దాటేందుకే కాకుండా పిల్లలు, యువత ఆహ్లాదంగా కొంత సమయం గడిపేందుకు ఉపయోగపడనున్నది.  

340 మీటర్లు.. 32.47 కోట్లు..

మెహదీపట్నం బస్​స్టాప్​ నుంచి ఎదురుగా ఉన్న  రక్షణ శాఖ స్థలం వరకు 340 మీటర్ల విస్తీర్ణంలో రూ. 32.47 కోట్లతో హెచ్​ఎండీఏ దీన్ని నిర్మిస్తోంది. మెహదీపట్నం నుంచి ఆసిఫ్​నగర్​ పీఎస్​వరకూ 160 మీటర్లు, మెహదీపట్నం నుంచి మల్లేపల్లి వైపు 180 మీటర్లు ఈ స్కైవాక్​ ఉంటుంది. దీన్ని అందమైన ఆర్చ్​మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. స్కైవాక్​ పైకి రాకపోకల కోసం ఐదు చోట్ల ఎంట్రీ , ఎగ్జిట్​పాయింట్లు పెట్టారు. అన్ని వైపులా 4 నుంచి 5 మీటర్ల వెడల్పులో వాక్​వేలు నిర్మించారు. 12 ఎలివేటర్లు పెట్టగా ఒక్కో ఎలివేటర్​ పై నుంచి 20 మంది వెళ్లొచ్చు.