అడవిలో ఒంటరిగా ఆమె

అడవిలో ఒంటరిగా ఆమె

అసలే అడవి. దారిపొడవునా క్రూర మృగాలు. గమ్యమేమో చాలా దూరం. ఏ ఆయుధం లేదు. తన ధైర్యమే తన ఆయుధంగా రోజూ అడవి దారిలో కాలినడకన వెళ్తూ డ్యూటీ చేస్తోంది ఈ పోస్ట్‌‌ మాస్టర్‌‌‌‌. పేరు ఫాతిమా రాణి. కొండయార్‌‌‌‌, మెల్తంగల్‌‌ బ్రాంచ్‌‌ పోస్ట్‌‌ ఆఫీస్‌‌కు పోస్ట్‌‌ మాస్టర్‌‌‌‌. ‘దట్టమైన అడవి. కాలు స్లిప్‌‌ అయితే లోయ లోకి పడిపోవడం ఖాయం. ఎప్పుడు ఏ జంతువు ఎటువైపునుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియదు. ఏమాత్రం ఏమరుపాటుతో ఉన్నా సూర్యోదయం చూడలేం.’ ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాను అంటున్న 58 ఏండ్ల ఫాతిమా కథ. 

ఫాతిమాది తమిళనాడులోని కొండయార్‌‌‌‌. మెల్తంగల్‌‌ బ్రాంచ్‌‌ పోస్ట్‌‌ ఆఫీస్‌‌లో పోస్ట్ మాస్టర్‌‌‌‌గా పనిచేస్తోంది. కలక్కాడ్, ముండంతురై అడవిలో  కొండల మధ్య ఉండే ఊరు ఇది. సముద్ర మట్టానికి దాదాపు 1,200 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండ ప్రాంతంలోని ప్రజలకు బయట ప్రపంచంతో ఏదైనా సంబంధం ఉందంటే అది ఫాతిమా వల్లనే. దాదాపుగా 10 కిలోమీటర్లు అడవిలో కొండలు ఎక్కుతూ దిగుతూ వాళ్లకు వచ్చిన పోస్ట్‌‌లను ఇస్తుంటుంది. అదికూడా పులులు, అడవి దున్నలు, అడవి పందులు, కొండచిలువలను దాటుకుంటూ..  చాలా సందర్భాల్లో ఆ జంతువులు తనను దాటిపోయేంత వరకు ఆగిపోయేది. లేదంటే సైలెంట్‌‌గా వాటి పక్క నుంచి వెళ్లిపోయేదట. 

పాతికేండ్ల కిందట ఈ ఉద్యోగంలో చేరింది ఫాతిమా. టైగర్‌‌‌‌ రిజర్వ్‌‌ ఏరియాలో ఒంటరిగా నడిచి వెళ్లాలంటే మొదట్లో భయపడేది. కొన్ని రోజులు భర్త తోడుగా వెళ్లేవాడు. ‘ఒక్క రోజు సమస్య కాదు ఇది. ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు ఇది తప్పదు. ఎన్ని రోజులని నా భర్తపైన ఆధారపడాలి? ఇది నా సమస్య. కాబట్టి పరిష్కారం కూడా నేనే వెతుక్కోవాలి’ అని అప్పుడు డిసైడ్‌‌ అయి తనకు తానే  ధైర్యం చెప్పుకుంది. ఎవరి తోడూ లేకుండా ఒక్కతే డ్యూటీకి వెళ్లడం మొదలు పెట్టింది.

పాతికేండ్ల ఉద్యోగ జీవితంలో వెన్నులో వణుకు పుట్టించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చిరుత ఎదురొచ్చి నిల్చున్నా,  పాములు దారికి అడ్డంగా పడుకున్నా,  ఆమె గుండె ధైర్యం ముందు అవి తోక ముడుచుకుని వెళ్లేవి. ఈ అడవిలో ఎప్పుడూ వర్షాలు కురుస్తుంటాయి. ఆ టైంలో చుట్టు పక్కల స్పష్టంగా కనిపించదు. దాంతో పొదలు, చెట్ల చాటున ఉన్న జంతువులను గుర్తించలేం. అడవి మృగాలు ఎదురుపడినప్పుడు ఎలా తప్పించుకోవాలో, అవి వస్తున్న విషయం ఎలా పసిగట్టాలో అటవీ శాఖ అధికారులు ట్రెయినింగ్‌‌ ఇస్తుంటారు. ‘ప్రమాదం ఎదురైనపుడు అవి కొంతవరకు ఉపయోగపడతాయి. అయితే ఒక్కోసారి జంతువులు మనవైపు దూసుకొస్తాయి. అలాంటపుడు కంగారు పడితే  మాత్రం ప్రాణాలకే ముప్పు’ అంటుంది ఫాతిమా.