మెట్రో ఆలస్యానికి సర్కారు అసమర్థతే కారణం..రిపోర్టులు ఇవ్వకుండా కేంద్రంపై నిందలేస్తారా?: ఎన్. రాంచందర్ రావు 

మెట్రో ఆలస్యానికి సర్కారు అసమర్థతే కారణం..రిపోర్టులు ఇవ్వకుండా కేంద్రంపై నిందలేస్తారా?: ఎన్. రాంచందర్ రావు 

 

  • అపాయింట్‌‌‌‌మెంట్ల కోసం లేఖలు రాయడం డ్రామా అంటూ ఫైర్‌‌‌‌
  • 71 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌‌కు ఇప్పుడే కిషన్ రెడ్డి గుర్తొచ్చారా అని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: మెట్రో ప్రాజెక్టు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌‌లోని పార్టీ స్టేట్‌‌ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. మెట్రో ఫేజ్-2కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రీ-ఫీజిబిలిటీ, ఫైనాన్షియల్ రిపోర్టులు, డీపీఆర్‌‌‌‌ను కేంద్రానికి సమర్పించలేదన్నారు.

సాంకేతిక పత్రాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని చెప్పడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు. ఇది కేంద్రం చేసిన రిజెక్షన్ కాదని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆలస్యం అని పేర్కొన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌‌పై క్లారిటీ ఇవ్వాలని కేంద్రం సూచించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, ఇప్పుడు రాజకీయ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌‌కు అభివృద్ధిపై కాకుండా, కేవలం స్కామ్‌‌లు, కమీషన్ల రాజకీయాలపైనే శ్రద్ధ ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

అపాయింట్‌‌మెంట్ లేఖ.. బూటకం.. 

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్‌‌మెంట్ ఇప్పించాలని కోరుతూ కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడం హాస్యాస్పదమని రాంచందర్ రావు అన్నారు. రెండేండ్లలో సీఎం 71 సార్లు ఢిల్లీకి వెళ్లారని 15 సార్లు కేంద్ర మంత్రులను కలిశారని, ఖట్టర్‌‌ను 5 సార్లు, అశ్వినీ వైష్ణవ్‌‌ను మూడు కలిశారని గుర్తుచేశారు. అప్పుడు కిషన్ రెడ్డిని సీఎం అడిగే కలిశారా? ఇప్పుడు మాత్రం అపాయింట్‌‌మెంట్ దొరకడం లేదనడం ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుందన్నారు.

6 గ్యారంటీలు, 420 హామీలను ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, సీనియర్ నటి జ్యోతి రెడ్డి, సినీ నిర్మాత బండి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. వారికి రాంచందర్‌‌‌‌ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.