గ్లామర్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'మెట్ గాలా' వేడుకలో మెరవాలనుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్, నిర్మాత రియా కపూర్ బృందానికి ఊహించని షాక్ తగిలింది. అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించాల్సిన రూ. 1.35 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన వజ్రాల చెవిపోగులు గాల్లోనే మాయమయ్యాయి. హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేలా జరిగిన ఈ మెగా చోరీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
అసలేం జరిగింది?
న్యూయార్క్ ఫ్యాషన్ ఈవెంట్ కోసం రియా కపూర్ ముంబయిలోని ప్రముఖ మెహతా జ్యువెలర్స్ నుంచి రూ. 66 లక్షల విలువైన 18 క్యారెట్ల ఎమరాల్డ్, వజ్రాల దిద్దులను.. అలాగే గోయెంకా జ్యువెలర్స్ నుంచి రూ. 69 లక్షల విలువైన జాంబియన్ ఎమరాల్డ్ స్టోన్ ఇయర్‌రింగ్స్‌ను అద్దెకు తీసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన వీటిని తనకు అత్యంత నమ్మకస్థురాలైన మేకర్ ఆర్టిస్ట్ సవ్లీస్ సింగ్ కు అప్పగించారు. సవ్లీన్ వాటిని రెండు ప్రత్యేక బాక్సుల్లో పెట్టి , తన హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకుంది.
మిస్టరీ ప్రయాణం.. ఖాళీ బాక్సులు..
ఏప్రిల్ 27 రాత్రి 10:25 గంటలకు ముంబయి నుంచి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా రియా టీమ్ ప్రయాణమైంది. ఏప్రిల్ 28 సాయంత్రం న్యూయార్క్‌లోని విలాసవంతమైన ది పియరీ హోటల్ కు చేరుకున్నారు. తీరా హోటల్ రూమ్‌లో మరో టీమ్ మెంబర్ షిరీన్‌కు నగలు ఇవ్వడానికి సవ్లీన్ తన హ్యాండ్‌బ్యాగ్ తెరిచి చూడగా.. ఆమె గుండె ఒక్కసారిగా గుభేల్‌మంది. బ్యాగులో బాక్సులు ఉన్నాయి.. కానీ లోపల ఉండాల్సిన కోట్ల విలువైన వజ్రాల నగలు మాత్రం మాయమయ్యాయి..
ALSO READ : హీరో, హీరోయిన్ కాదు కంటెంట్ ముఖ్యం
దొంగతనం ఎక్కడ జరిగింది?
న్యూయార్క్ నుంచి ముంబయికి తిరిగి వచ్చిన వెంటనే సవ్లీన్ సింగ్ సహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 303(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు . ప్రస్తుతం ఈ కేసు అంతర్జాతీయ మిస్టరీగా మారింది. అసలు ముంబయి ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెకింగ్ వద్ద జరిగిందా? లేదా? విమానంలో ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో హ్యాండ్‌బ్యాగ్ నుంచి కొట్టేసారా? లేదా దుబాయ్ ట్రాన్సిట్, న్యూయార్క్ జేఎఫ్‌కే (JFK) ఎయిర్‌పోర్టులలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజీలు, విమాన సిబ్బంది వివరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచాన్ని షేక్ చేసిన ఈ మెగా రాబరీ వెనుక ఉన్న ఆ కిలాడీ దొంగ ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది..
