మైనింగ్ మాఫియా.. వేల కోట్ల మేత! గత ప్రభుత్వ హయాంలో భారీగా రాయల్టీ , జీఎస్టీ, సీనరేజ్ ఫీజుల ఎగవేత

మైనింగ్ మాఫియా.. వేల కోట్ల మేత! గత  ప్రభుత్వ హయాంలో భారీగా రాయల్టీ , జీఎస్టీ, సీనరేజ్ ఫీజుల ఎగవేత
  • నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ ​అక్రమ తరలింపు
  • నకిలీ వే బిల్లులు, తప్పుడు నివేదికలతో మోసాలు
  • కరీంనగర్​లో 3, ఖమ్మంలో ఒక గ్రానైట్ క్వారీల్లో మైనింగ్ ​శాఖ ప్రాథమిక విచారణ 
  • భారీ ఎత్తున అక్రమాలు బట్టబయలు
  • పాలమూరులో విలువైన క్వార్డ్జ్​ను  నాణ్యత లేనిదిగా చూపి భారీ గోల్​మాల్​ 
  • సిరిసిల్ల మానేరు నుంచి వందల కోట్ల ఇసుక లూటీ
  • సీఐడీ విచారణ కోసం నివేదిక అందించిన మైనింగ్​ శాఖ
  • రాష్ట్రమంతా ఎంక్వైరీ చేస్తే భారీ స్కాంలు బయటకొస్తాయంటున్న అధికారులు 

హైదరాబాద్​, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో పాలకుల అండతో బరితెగించిన మైనింగ్ మాఫియా సర్కారు ఖజానాకు భారీగా గండికొట్టింది.  నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్​ను , క్వార్ట్జ్​ను, ఇసుకను అక్రమంగా తరలించడం, నకిలీ వే బిల్లులు, తప్పుడు నివేదికలతో మోసాలకు పాల్పడడం ద్వారా వేల కోట్ల రాయల్టీ, జీఎస్టీ, సీనరేజ్ ఫీజులను దారిమళ్లించింది.

  కాంగ్రెస్​ ప్రభుత్వ ఆదేశాల మేరకు మైనింగ్​ మాఫియా అక్రమాల బాగోతాన్ని భూగర్భ గనుల శాఖ ​ఎట్టకేలకు బయటపెట్టింది. కరీంనగర్ జిల్లాలోని మూడు ప్రముఖ గ్రానైట్ క్వారీలతో పాటు ఖమ్మం జిల్లాలోని మరో కీలక క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్‌‌‌‌ను తరలించినట్లు మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. 

వీటితో పాటు మహబూబ్​నగర్ జిల్లాలోని క్వార్ట్జ్ మైనింగ్‌‌‌‌లో సైతం భారీ ఎత్తున అక్రమా లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సిరిసిల్ల కేంద్రంగా మానేరు వాగులో ఇసుక మాఫి యా దందా వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తేల్చారు. ఈ మొత్తం అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేసి, అసలు సూత్రధారులను బయటకు లాగేందుకు మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు  నివేదిక సిద్ధం చేశారు.  

సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సీఐడీ (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్)కి రిపోర్ట్​ అందజేసింది. 2014 నుంచి 2026 వర కు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్నిరకాల మైనింగ్ పై సీఐడీ ఎంక్వైరీ చేయించి నిజానిజాలు తేలుస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా మైనింగ్​శాఖ అధికారులు పలు క్వారీల పరిధిలో ఎంక్వైరీ చేసి ఆ నివేదికతో పాటు గతంలో కాగ్​ఇచ్చిన ఆడిట్ రిపోర్టులను సైతం సీఐడీకి అందజేసినట్లు తెలిసింది. 

  • అక్రమ తవ్వకాలు.. రాయల్టీ, సినరేజీ ఎగవేతలు

రాష్ట్రంలో  గ్రానైట్, క్వార్ట్జ్​ మైనింగ్​లో కొందరు బడాబాబులు సాగిస్తున్న అక్రమాలపై కాంగ్రెస్​ సర్కారు ఆదేశాలతో మైనింగ్ శాఖ పక్కా సమాచారం సేకరించింది. ప్రాథమికంగా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోని మూడు ప్రధాన గ్రానైట్ క్వారీల్లో జరిగిన అక్రమాలపై ఆధారాలు సంపాదించింది. ఇక్కడ అనుమతించిన పరిమాణం కంటే అదనంగా దాదాపు లక్షన్నర క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌‌‌‌ను అక్రమంగా తరలించినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా అధికారులు గుర్తించారు. 

అలాగే ఖమ్మం జిల్లాలోని మరో క్వారీలో అనుమతులు ముగిసినప్పటికీ ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే రాత్రికి రాత్రే రవాణా చేసినట్లు తేల్చారు. కరీంనగర్ తో పాటు  ఖమ్మం జిల్లాల కలర్ గ్రానైట్, డోలమైట్ క్వారీల అసెస్‌‌‌‌మెంట్ ఫైళ్లను కాగ్ తనిఖీ చేయగా అధికారులు, వ్యాపారులతో కుమ్మకైన విషయం బయటపడింది. 

లీజుదారులు ఆన్యువల్​రిటర్న్స్‌‌‌‌లో చూపిన ఖనిజ పరిమాణం కంటే తక్కువగా అధికారులు లెక్కగట్టి రాయల్టీలను భారీగా దారిమళ్లించిన విషయం వెలుగుచూసింది. వీటి విలువ రూ. వెయ్యి కోట్లకుపైగా  ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగ్​ రిపోర్ట్​లో పేర్కొన్న ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన గ్రానైట్​ లీజుదారులకు చెందిన రూ. 105 కోట్లకు పైగా సెక్యూరిటీ డిపాజిట్లను జప్తు చేయలేదు. 

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కేవలం 17,450 మెట్రిక్ టన్నులకే పర్మిట్లు తీసుకుని, రికార్డుల్లో లేకుండా ఏకంగా 3,13,095 మెట్రిక్ టన్నుల మేర (15 రెట్లు ఎక్కువ) ఖనిజాన్ని అక్రమంగా తరలించారు. డ్రోన్, డీజీపీఎస్ సర్వేలు, వీడియో సర్వైలెన్స్ వంటి ఆధునిక సాంకేతికతను వాడకపోవడంతో పాటు డీసీబీ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకుండా 6% నుండి 24% వడ్డీలను వదిలేసినట్లు నివేదికలో మైనింగ్​ శాఖ పేర్కొన్నట్లు తెలిసింది.

  • నకిలీ వే బిల్లులు.. నాణ్యత లేదంటూ  తప్పుడు నివేదికలు

కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ బృందాలు నవంబర్ 2022లో అప్పటి  మంత్రి, ఓ  ఎంపీ ఇండ్లు, కార్యాలయాలపై దాడులు జరిపాయి. ఈ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల రఫ్ గ్రానైట్ బ్లాకులను చైనాకు అక్రమంగా తరలించినట్లు ఈడీ  పేర్కొన్న విషయాన్ని కూడా మైనింగ్ శాఖ సీఐడీకి నివేదించినట్లు తెలిసింది.  కరీంనగర్ పరిధిలోని  ప్రముఖ గ్రానైట్​ ఏజెన్సీలు పోర్టు అధికారులతో కుమ్మక్కై సైజులను తక్కువగా చూపించి రూ. 124.94 కోట్ల డైరెక్ట్ సీనరేజ్ ఫీజును ఎగవేసినట్లు పేర్కొంది. 

ఈ అక్రమ మైనింగ్, సరుకు రవాణా ఎగవేతలకు గాను సదరు క్వారీ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ విభాగాలు మొత్తంగా రూ. 749 కోట్ల భారీ జరిమానా విధిస్తూ గతంలోనే నోటీసులు జారీ  చేసిన విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రభుత్వ రికార్డులను సైతం ట్యాంపరింగ్ చేసి, నకిలీ వే-బిల్లులతో ఈ దందా సాగించినట్లు మైనింగ్ శాఖ ఇంటెలిజెన్స్ విభాగం పక్కా ఆధారాలు సేకరించింది.  

మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన క్వార్ట్జ్​ మైనింగ్ అక్రమాలు సైతం అధికారులను విస్మయానికి గురిచేశాయి. విలువైన క్వార్ట్జ్​ ఖనిజాన్ని తక్కువ ధరకు నాణ్యత లేనిదిగా చూపి పక్క రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేసినట్లు తేలింది. ఇక్కడ సుమారు 80 వేల టన్నుల క్వార్డ్జ్ ఖనిజాన్ని మైనింగ్ రికార్డుల్లో నమోదు చేయకుండానే తరలించారు.

 దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 60 కోట్ల మేర ప్రత్యక్షంగా నష్టం వాటిల్లింది. క్వారీ లీజుదారులు స్థానిక కొందరు అధికారుల అండదండలతోనే ఈ ఐదు చోట్లా పదేండ్లపాటు సమాంత ర వ్యవస్థ నడిపినట్లు తెలుస్తోంది. పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కి, మైనింగ్ చట్టం-1957 నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ సాగించిన ఈ తవ్వకాలు జరిపారని మైనింగ్​శాఖ నివేదించింది.

  • సిరిసిల్ల ఇసుక దందాపైనా..

సిరిసిల్ల కేంద్రంగా మానేరు ఇసుక తవ్వకాల్లో వందల కోట్లు దారి మళ్లినట్లు  మైనింగ్​ శాఖ నివేదించింది. ఈ దందాపై నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్, కాగ్ అప్పటి సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనుమతించిన 3 మీటర్ల పరిమితిని ఉల్లంఘించి భారీ యంత్రాలతో నదీ గర్భాన్ని 25 నుంచి 30 అడుగుల లోతుకు తవ్వడంతో భూగర్భ జలాలు 15 మీటర్ల లోతుకు పడిపోయి బావులు ఎండిపోయినట్లు చెప్పాయి. ప్రస్తుతం మైనింగ్​ విచారణ ప్రాథమిక అంచనాల ప్రకారం.. సిరిసిల్ల పరిసరాల్లోని మానేరు నది నుంచి ప్రతిరోజూ 600 నుంచి 800 టిప్పర్ల ఇసుక హైదరాబాద్​ వెళ్లేది. 

నకిలీ వే- బిల్లుల ద్వారా, ఒకే పర్మిట్‌‌‌‌పై 4 ట్రిప్పులు వేస్తూ హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు అక్రమంగా తరలించి  వందల కోట్ల లూటీకి పాల్పడ్డట్లు మైనింగ్​శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ మాఫియా వెనుక అప్పటి సీఎం కేసీఆర్​కు అత్యంత సన్నిహితుడైన అప్పటి రాజ్యసభ ఎంపీ ఉన్నట్లు గుర్తించింది. ఇసుక తవ్వకాలకు జీపీఎస్, ఆన్‌‌‌‌లైన్ ట్రాకింగ్ లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు సబ్-కాంట్రాక్టులు ఇవ్వడంపైనా సీఐడీకి వివరాలు అందించడం గమనార్హం.