బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్వి నిరాధార ఆరోపణలు: మంత్రి అజారుద్దీన్

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్వి నిరాధార ఆరోపణలు: మంత్రి అజారుద్దీన్
  • గురుకులాల టెండర్లలో ఎలాంటి స్కామ్‌‌‌‌‌‌‌‌ లేదు: మంత్రి అజారుద్దీన్
  • రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్​
  • గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నందునే రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నదని మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. గురుకులాల టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదని, బీఆర్‌‌‌‌ఎస్‌‌ మాత్రం ఏదో స్కామ్‌‌ జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్‌‌లో జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో అజారుద్దీన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ నేతలు ఈ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌‌రెడ్డి ఎంతో కష్టపడుతున్నారని, విద్యా విధానంలో సంస్కరణలు తీసుకువస్తూ, విద్యకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఫీజు రీయంబర్స్‌‌మెంట్ చెల్లించకపోవడం అనేది గత ప్రభుత్వం చేసిన నిర్వాకమే అని,  ఆ  ప్రభుత్వం చేసిన తప్పులు  ఇప్పుడు తమ ప్రభుత్వానికి సమస్యగా మారాయని పేర్కొన్నారు.  దీనిపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. 

‘సర్‌‌‌‌’పై అప్రమత్తంగా ఉండాలి 

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అజారుద్దీన్​ కోరారు. పశ్చిమ బెంగాల్, బిహార్‌‌‌‌లో సర్ పేరుతో ఎలా ఓట్లను తొలగించారో చూశామని, దాన్ని దృష్టిలో ఉంచుకొని అర్హులైన ఒక్క ఓటు కూడా పోకుండా పార్టీ కార్యకర్తలు అలర్ట్‌‌గా ఉండాలని కోరారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చాలా మంచి ప్రోగ్రామ్ అని, తమది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల విషయంలో సానుకూలంగా ఉంటుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మంచి కార్యక్రమం చేపట్టారని, దీనివల్ల పేదల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయని చెప్పారు.

తనకు వివిధ సమస్యలపై 200 వరకు ప్రజల నుంచి వినతులు వచ్చాయని, ఇందులో అప్పటికప్పుడు 50 సమస్యలు కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరించానని, మిగితా సమస్యలు కూడా పరిష్కారం కోసం ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి అజార్ చెప్పారు. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, హత్యలు బాగా పెరిగిపోయాయని, సమాజంలో ఇది మంచి సంస్కృతి కాదని అన్నారు. ప్రభుత్వం, పోలీసులు ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగులో తాను వేగంగా, స్పష్టంగా మాట్లాడలేకపోయినా.. తెలుగు చదవడం, రాయడం వచ్చని అజార్ చెప్పారు. తాను స్కూల్‌‌లో చదివే సమయంలో తెలుగు భాష నేర్చుకునేందుకు ట్యూషన్ మాస్టర్‌‌‌‌ను కూడా పెట్టించుకున్నానని గుర్తు చేశారు.