- ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా దూసుకెళ్తోంది: మంత్రి శ్రీధర్బాబు
- యూఎస్ నేషనల్ కాలేజ్ వార్ప్రతినిధులతో సెక్రటేరియెట్లో భేటీ
హైదరాబాద్, వెలుగు: ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని యూఎస్ నేషనల్ కాలేజ్ వార్ ప్రతినిధులను కోరారు. గురువారం సెక్రటేరియెట్లో వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, ఏరోస్పేస్ కాంపోనెంట్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ, ఏఐ ఇన్ డిఫెన్స్, శాటిలైట్స్ సిస్టమ్స్ అండ్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని చెప్పారు. రాకెట్ల తయారీ నుంచి అత్యాధునిక డ్రోన్ల వరకు, యుద్ధ విమానాల విడిభాగాల నుంచి శాటిలైట్ల వరకు.. అన్నింటిలోనూ మేడిన్ తెలంగాణ మార్క్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందన్నారు.
ఆయా రంగాల్లో తెలంగాణ ఏటా 30 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేస్తోందని పేర్కొన్నారు. 2024–26 మధ్య కాలంలో ఎగుమతుల్లో 103 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) నమోదైందని తెలిపారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్ డీఏ ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్ ఎఫెక్టివ్ ఏరోస్పేస్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాబోయే రోజుల్లో ఆ దిశగా అడుగులు వేస్తామని స్టేట్ డిపార్ట్ మెంట్ మినిస్టర్ కౌన్సిలర్ పాల్ నరైన్ తెలిపారు.
ప్రోటో ల్యాబ్స్ జీసీసీతో 300 మందికి ఉద్యోగాలు
అమెరికాకు చెందిన అధునాతన ఇంజనీరింగ్, డిజిటల్ తయారీ సంస్థ ప్రోటోల్యాబ్స్ టెక్నాలజీస్ హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఆరోహన్ గ్లోబల్కన్సల్టింగ్తో కలిసి దీన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. దీనివల్ల 300 మందికి ఉద్యోగావకాశాలు దొరుకుతాయని చెప్పారు.

