కాంగ్రెస్, బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలుపుతరు

కాంగ్రెస్, బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలుపుతరు
  • కాంగ్రెస్, బీజేపీని గెలిపిస్తే రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలుపుతరు
  • సర్కార్ పథకాలు చూసి ఆ పార్టీల కండ్లు మండుతున్నయ్: గంగుల


మందమర్రి, వెలుగు: రాష్ట్ర సర్కార్​అమలు చేస్తున్న పథకాలతో కాంగ్రెస్, బీజేపీ వాళ్ల కండ్లు, కడుపు మండుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలను గెలిపిస్తే, రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్రాలో కలుపుతారని అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్​లో రెండో విడత సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై 587 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడారు. ‘‘సింగరేణి ఖాళీ జాగల్లో ఇండ్లు కట్టుకున్న కార్మిక, కార్మికేతర కుటుంబాలు పట్టాల కోసం 60 ఏండ్లుగా పోరాటం చేస్తున్నాయి. సింగరేణి భూముల క్రమబద్ధీకరణ చేయాలని ఎంత మొత్తుకున్నా సమైక్య పాలకులు కనికరించలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక స్పందించి ఇండ్ల పట్టాలు ఇస్తున్నారు” అని చెప్పారు.  

మున్నూరుకాపులు దేశానికి అన్నం పెడుతున్నరు... 

దేశ ప్రజలకు అన్నం పెడుతున్న ఘనత మున్నూరుకాపులకే దక్కుతుందని, ఈ కులంలో పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందని గంగుల అన్నారు. క్యాతనపల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్​లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మున్నూరుకాపు కుల సంఘం ఆధ్వర్యంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దండె విఠల్​కు ఆత్మీయ సన్మానం చేశారు. దీనికి హాజరై గంగుల మాట్లాడారు. మున్నూరుకాపు కులస్తులంటే వ్యవసాయ కుటుంబాలే గుర్తుకు వస్తాయన్నారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబడిన మున్నూరుకాపులను గుర్తించి సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో మంచి అవకాశాలు ఇచ్చారన్నారు.