వేరే పార్టీ వాళ్లు కూడా మాకు ఓటేసిన్రు

వేరే పార్టీ వాళ్లు కూడా మాకు ఓటేసిన్రు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​లో తమకున్న ఓట్లు తమ పార్టీ టీఆర్ఎస్​కే పడ్డాయని, ఎక్కడా క్రాస్ ఓటింగ్ జరగలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్ బలం 984 మందేనని, అయినా ఇతర పార్టీల నుంచి 80 మంది స్వచ్ఛందంగా తమకు మద్దతుగా ఓట్లు వేశారని చెప్పారు. ఉమ్మడి అభ్యర్థికి 324 మంది ఇతర  పార్టీలకు చెందిన వాళ్ల మద్దతు ఉన్నా.. ఇందులో  232 మంది మాత్రమే ఓట్లు వేశారని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ బలం మరోసారి నిరూపితం అయిందన్నారు. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత మంగళవారం కరీంనగర్​లోని ఎస్ ఆర్ ఆర్  డిగ్రీ  కాలేజ్ లో పార్టీ అభ్యర్థులు ఎల్. రమణ, భాను ప్రసాద్ రావు తో కలిసి మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు.

‘‘కరీంనగర్​లో అభ్యర్థిని పెట్టలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించగా..  మరోవైపు ఈటల రాజేందర్ మాత్రం తమ అభ్యర్థి రవీందర్ సింగ్ కు ఓటు వేయాలంటూ బహిరంగంగా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీకి ఎవరు అధ్యక్షులనే విషయం బండి సంజయ్ సమాధానం చెప్పాలి” అని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలు పూర్తయ్యాయని, ఇక రాజకీయాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి మీదనే దృష్టిసారిస్తామని మంత్రి చెప్పారు. తనపై దారుణమైన విష ప్రచారం చేసినా..  చివరకు విజయం తమ పార్టీనే వరించిందని అభ్యర్థి భాను ప్రసాద్ రావు అన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తామని, కేసీఆర్ శక్తి వల్లనే తాము విజయం సాధించామని మరో అభ్యర్థి ఎల్. రమణ చెప్పారు.

గంగుల మంత్రిలా వ్యవహరించలేదు: రవీందర్​ సింగ్​
ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక అధికారుల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్  చెప్పారు. తనను పోటీలో నిలువకుండా టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని, ఇక్కడ గంగుల కమలాకర్ మంత్రిలా వ్యవహరించలేదని విమర్శించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఈసీకి ఇచ్చానని తెలిపారు. ఇక్కడ టీఆర్ఎస్‌ది విజయం కాదని... నైతికంగా తనదే విజయమని  ఆయన అన్నారు.