కరీంనగర్ రోడ్డు ప్రమాద బాధితుల్ని అదుకుంటాం

కరీంనగర్ రోడ్డు ప్రమాద బాధితుల్ని అదుకుంటాం

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి గంగుల కమలాకర్​ చెప్పారు. మృతుల కుటుంబాలకు డబుల్​బెడ్​రూం ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ మీటింగ్​హాల్​లో మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కమాన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. ఇందులో ఆఫీసర్లు, ప్రభుత్వ వైఫల్యం లేదన్నారు. ఇప్పటికే కొలిమి పనులు చేసుకునే కొన్ని కుటుంబాలను అక్కడి నుంచి తొలగించామని చెప్పారు. అయినప్పటికీ కొందరు తిరిగి అక్కడే కొలిమి పనులు కొనసాగిస్తున్నారన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన ట్రీట్​మెంట్ అందించేందుకు నగునూర్ లోని ప్రతిమ హాస్పిటల్​కు షిఫ్ట్​చేస్తామన్నారు. అడిషనల్​కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలో రోడ్లు, ఫుట్​పాత్​ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. కమ్మరులను బస్టాండ్ వెనకాల నిర్మించిన షెడ్లలోకి తరలించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సేవాఇస్లావత్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.