పీఆర్వోను తొలగించిన గంగుల

పీఆర్వోను తొలగించిన గంగుల
  • మంత్రి పీఆర్వో వసూళ్ల దందా
  • స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని బేరసారాలు
  • సోషల్​ మీడియాలో ఆడియోలు వైరల్ 
  • మరో ఘటనలో మిల్లర్ ​నుంచి రూ. 10 లక్షలు తీసుకున్న మంత్రి అనుచరుడు 
  • పీఆర్వోను తొలగించిన గంగుల

కరీంనగర్, వెలుగు: మంత్రి గంగుల కమలాకర్ దగ్గర ఇటీవల పీఆర్వోగా చేరిన బోనాల మల్లికార్జున్​ ఓ ఘటనలో స్టేషన్​ బెయిల్​ కోసం ఓ వాటర్​ప్లాంట్​ యజమాని నుంచి రూ. లక్ష డిమాండ్​ చేసిన ఆడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. ఇది అటు తిరిగి ఇటు తిరిగి గంగుల మెడకు చుట్టుకునే అవకాశముండడంతో ఆయన మల్లికార్జున్​ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. 

ఇదీ జరిగింది.. 

ఇటీవల కరీంనగర్​ పోలీసులు సిటీలో అనుమతిలేని వాటర్ ప్లాంట్ల మీద రైడ్ చేసి కొంతమందిపై కేసులు పెట్టారు. ఓ నిర్వాహకుడు ఈ కేసు నుంచి బయటపడేందుకు మంత్రి పీఆర్వో మల్లికార్జున్​ ను కలిశాడు. దీంతో తనకు రూ.లక్ష ఇస్తే స్టేషన్ బెయిల్ ఇప్పించడమే కాకుండా, నాలుగు రోజుల్లో కేసే లేకుండా చేస్తానని మాటిచ్చాడు. 15 రోజుల కింద మంత్రి పీఏ,  బాధితుడి మధ్య జరిగిన ఈ ఫోన్ సంభాషణ తాజాగా బయటకు పొక్కింది. సోషల్​మీడియాలో వైరల్​ కావడంతో అతడిని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 

పర్మిషన్​ ఇప్పిస్తానని రూ.10 లక్షలు

ఇదిలా ఉండగా, మంత్రి గంగుల అనుచరుడొకరు, కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ కోసం పర్మిషన్​ ఇప్పిస్తానని రూ.10 లక్షలు తీసుకొని మోసం చేశాడని పెద్దపల్లికి చెందిన  రైస్​మిల్లర్​ దేవేందర్​రెడ్డి కరీంనగర్​ 3 టౌన్​  లో  ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం ప్రకారం..మంత్రి అనుచరుడిగా చెప్పుకునే ఒకరు కస్టమ్​ మిల్లింగ్​ రైస్​కోసం పర్మిషన్​ ఇప్పిస్తానని,  రూ.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. రూ.10 లక్షలు తీసుకొని పర్మిషన్​ ఇప్పించకుండానే  మరో  రూ. 20 లక్షలు అడిగాడు. దీంతో పైసలు వెనక్కి ఇవ్వాలని బాధితుడు అడగ్గా బెదిరించడంతో పోలీసులనకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో ఏమాత్రం వాస్తవం ఉన్నా బాధ్యులపై కేసు నమోదు చేయాలని మంత్రి గంగుల కమలాకర్​3టౌన్​ పోలీసులకు  చెప్పినట్లు తెలిసింది.