సీబీఐ విచారణపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్

సీబీఐ విచారణపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్

ఇటీవల జరిగిన సీబీఐ విచారణపై మంత్రి గంగుల స్పందించారు. కరీంనగర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల పురో గతిని పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్... సీబీఐ తనను కేవలం 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నలు వేశారని చెప్పారు. మళ్లీ మళ్లీ పిలవడం ఎందుకని కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారన్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నామని, తప్పులు చేయమని స్పష్టం చేశారు. తన బావ రవి చంద్ర రూ.15 లక్షలు క్రెడిట్ పై శ్రీనివాస్ కు ఇప్పించారన్న మంత్రి... తమను నకిలీ సీబీఐ అధికారి ఏ రోజు కూడా డబ్బులు డిమాండ్ చేయలేదని తెలిపారు. విశాఖపట్నం సీబీఐ కాలనీలో శ్రీనివాస్ కు బియ్యం షాప్ ఉందని గంగుల అన్నారు. అందుకే అందరూ అతన్ని సీబీఐ శ్రీనివాస్ అంటారని తర్వాత తెలిసిందని వివరించారు.

నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో గత కొన్ని రోజుల క్రితం మంత్రి గంగులను సీబీఐ విచారించింది. 15 రోజుల క్రితం హైదరాబాద్​లో జరిగిన కాపు సమ్మేళనంలో గంగుల కమలాకర్​తో శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అధికారి అని పరిచయం చేసుకున్నాడు. మూడు నాలుగేండ్లుగా సీబీఐలో పని చేస్తున్నట్లు చెప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి శ్రీనివాస్ ఫొటోలు దిగాడు. అయితే శ్రీనివాస్ అరెస్ట్ అనంతరం అతన్ని విచారించే క్రమంలో ఫోన్ లో మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు ఫొటోలు కనిపించడంతో సీబీఐ.. మంత్రి గంగులను ప్రశ్నించారు. ఇందులో భాగంగానే మంత్రి గంగులను ఢిల్లీకి రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది.