వడ్ల కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్‌ సమీక్ష

వడ్ల కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్‌ సమీక్ష
  • 1.28 లక్షల టన్నులు సేకరణకు ఉత్తర్వులు
  • ఇప్పటి వరకు 40 వేల రైతుల నుంచి 7.51 లక్షల టన్నుల ధాన్యం కొన్నం : గంగుల
  • వడ్ల కొనుగోళ్లపై మంత్రి సమీక్ష

హైదరాబాద్‌‌, వెలుగు: అకాల వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్​గా మారుస్తామని.. ఇందుకోసం 1.28 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్​ సేకరణపై ఉత్తర్వులు ఇచ్చామని సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌‌ తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్‌‌లో మంత్రి ధాన్యం సేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా కురుస్తున్న అకాల వర్షాల్లో, ప్రతికూల పరిస్థితుల్లోనూ వడ్ల సేకరణ జరుగుతున్నదని తెలిపారు. వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన జిల్లాలైన నల్గొండలో 22వేల టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట్, పెద్దపల్లి, సూర్యాపేట కొత్తగూడెం జిల్లాల్లో 14,706 టన్నులు, నిజమాబాద్‌‌లో  14,700 టన్నులు, కరీంనగర్ 7350టన్నులు, యాదాద్రి, జగిత్యా లల్లో 5000వేల టన్నుల చొప్పున బాయిల్డ్ రైస్ సేకరణకు ఆర్డర్ ఇచ్చామని పేర్కొన్నారు.

సోమవారం వరకు నిరుడు యాసంగి కన్నా రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరించామని, గతేడాది ఇదే రోజు వరకు 3.23 లక్షల టన్నులు కొంటే ఈ సారి ఈ రోజు వరకు 7.51 లక్షల టన్నులు సేకరించామని గంగుల వివరించారు. రోజుకు 80 వేల మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 5000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 40 వేల మంది రైతుల నుంచి 7.51 లక్షల టన్నుల వడ్లు సేకరించామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.1543 కోట్ల విలువైన వడ్లు సేకరించామని.. నిధులకు ఎలాంటి కొరత లేదన మంత్రి వివరించారు. సమీక్షలో సివిల్‌‌ సప్లయ్స్‌‌ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

బీసీల ఆత్మగౌరవ భవనాలు త్వరగా పూర్తి చేయాలి

బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. భవన నిర్మాణ పనుల పురోగతిపై సోమవారం సెక్రటేరియట్​లో అధికారులతో ఆయన రివ్యూ చేశారు. ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలన్నారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల ద్వారా అందించే రూ.603 కోట్లకు సంబంధించిన యాక్షన్ ప్లాన్​పై అధికారులకు ఆయన సూచనలు చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.