ఒకే విడతలో 15 బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు

ఒకే విడతలో 15 బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు
  •     ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు కల్పిస్తం: మంత్రి గంగుల
  •     గీజర్ల కోసం సీఎం 85 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడి

కరీంనగర్‍టౌన్, వెలుగు: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒకే విడత15 బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను మంజూరు చేస్తున్నట్లు బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం కరీంనగర్​లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇప్పటికే ఉన్న 261 బీసీ గురుకులాలకు అదనంగా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున కొత్తగా 33 బీసీ గురుకులాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటితోపాటు15 బీసీ రెసిడెన్షియల్​డిగ్రీ కాలేజీలను మంజూరు చేస్తూ జీవో ఇచ్చినట్లు చెప్పారు. బీసీ గురుకులాల్లో నాణ్యమైన విద్య, మంచి సౌలత్​లతోని అడ్మిషన్లకు డిమాండ్ పెరిగిందని మంత్రి చెప్పారు. కొత్తగా ప్రకటించిన 33 బీసీ గురుకులాల్లో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తామని మంత్రి గంగుల చెప్పారు. దీని వల్ల 5,6,7 తరగతులకు కలిపి ప్రతీ విద్యాలయంలో 240 చొప్పున దాదాపు 8వేల మంది బీసీ విద్యార్థులకు అదనంగా ప్రయోజనం జరుగుతుందన్నారు.

ఇప్పటికే చాలా గురుకులాలకు సొంత భవనాలు సమకూర్చామని, దశల వారీగా అన్నింటికీ పక్కా భవనాలు నిర్మించి తరలిస్తామన్నారు. బీసీ సంక్షేమ గురుకులాల్లో వానాకాలం, చలికాలంలో స్నానానికి ఇబ్బందిగా ఉందన్న విద్యార్థుల విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకెళ్లగా,  రూ.85 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ అకడమిక్ ఇయర్ లోనే అన్ని గురుకులాల్లో గీజర్లతో వేడినీరు అందిస్తామన్నారు. ఈ ఏడాది నుంచే డిమాండ్ ఉండే 8 రకాల కంప్యూటర్ సైన్స్ కోర్సులతో బీసీ డిగ్రీ కాలేజీలను ప్రారంభిస్తున్నామన్నారు. వీటితో 4,800 మంది బీసీ బిడ్డలకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు19 గురుకులాల్లో 7500 మంది విద్యార్థులు మాత్రమే చదువుకునే వారని, ప్రస్తుతం 310 గురుకులాలతోపాటు, 16 డిగ్రీ కాలేజీలు, 142 జూనియర్ కాలేజీలు,152 స్కూళ్లు నెలకొల్పి వేలాది మంది స్టూడెంట్లకు నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు మంత్రి గంగుల పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు