మున్నూరుకాపు కార్పొరేషన్ తెచ్చే బాధ్యత నాదే : గంగుల కమలాకర్

మున్నూరుకాపు కార్పొరేషన్ తెచ్చే బాధ్యత నాదే : గంగుల కమలాకర్
  •     డిమాండ్ల పరిష్కారానికి టైమ్ పడ్తది 
  •     ఈసారి మనకు 10 టికెట్లు ఇచ్చారు  
  •     అందరినీ గెలిపించాలని పిలుపు
  •     జలవిహార్​లో ప్లీనరీ సన్నాహక సభ  

కేసీఆర్ ఎప్పుడూ నో అనరు: గంగుల

ముషీరాబాద్, వెలుగు :  మున్నూరుకాపులపై సీఎం కేసీఆర్​కు చాలా గౌరవం ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ‘‘కేసీఆర్​కు నో అనే పదం రాదు. సమయాన్ని బట్టి మున్నూరుకాపు కార్పొరేషన్ ప్రకటిస్తారు. కార్పొరేషన్ తెచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు మున్నూరుకాపుల డిమాండ్స్ నెరవేర్చే బాధ్యతనూ నా భుజాల మీద వేసుకుంటాను. డిమాండ్స్ వెంటనే పరిష్కారం కావు. సమయం పడుతుంది” అని ఆయన చెప్పారు. ఆదివారం హైదరాబాద్​లోని జలవిహార్​లో మున్నూరుకాపు ఎఫెక్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో ప్లీనరీ సన్నాహక సభ జరిగింది. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడారు. 

‘‘మున్నూరుకాపులు రాజకీయంగా ఐక్యంగా ముందుకెళ్లి భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలి. మున్నూరుకాపులు అందరితో కలిసి ఉంటారు. బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నారు. అందుకే మనపై ఉన్న నమ్మకంతో ఈసారి 10 సీట్లు ఇచ్చారు. వాళ్లను గెలిపించుకుని డిమాండ్లను పరిష్కరించుకుందాం” అని పిలుపునిచ్చారు. బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ‘‘గతంలో రాజకీయ పల్లకి మోసిన మున్నూరుకాపులు.. ఇప్పుడు అదే పల్లకి ఎక్కే అవకాశం వచ్చింది. 

పార్టీలకు అతీతంగా మున్నూరుకాపులను గెలిపించుకోవాలి” అని పిలుపునిచ్చారు. పుట్ట మధు మాట్లాడుతూ.. ‘‘నాపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ అబద్ధాలు. నేను తప్పు చేసి ఉంటే, కేసీఆర్ నాకు టికెట్ ఎందుకిస్తారు” అని ప్రశ్నించారు. 

ఖరీదైన ఏరియాల్లో ఆత్మగౌరవ భవనాలిస్తున్నం

హైదరాబాద్/ మేడిపల్లి, వెలుగు :  కుల భవనాల కోసం సీఎం కేసీఆర్​.. ఎకరం రూ.వంద కోట్లు పలికే కోకాపేటలో భూములిచ్చారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కోకాపేటలో పెరిక ఆత్మగౌరవ భవనం ప్రారంభోత్సంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. బీసీ స్టూడెంట్స్​ విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం రూ.20 లక్షలు సాయం చేస్తున్నదన్నారు. ఆత్మగౌరవ భవనానికి మరో రూ.5 కోట్లు కేటాయించాలని ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు. 

పెరిక ఆత్మగౌరవ భవనంతోపాటు ఫీర్జాదిగూడలో చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఆత్మగౌరవ భవనానికి మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్​ గౌడ్, మల్లారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు శంకుస్థాపన చేశారు.