తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నరు : గంగుల

తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నరు : గంగుల

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయంతో కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. హుజూరాబాద్, దుబ్బాక లాగా సానుభూతితో గెలవాలని భావించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు ఫలించలేదన్నారు. మునుగోడు ప్రజలు తమ తీర్పుతో బీఆర్ఎస్ పార్టీని స్వాగతించారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనానికి ఇది తొలి విజయమని స్పష్టం చేశారు. సింహగర్జనతో తెలంగాణ సాధించుకున్నట్లుగానే.. దక్షిణ తెలంగాణలో మునుగోడు విజయంతో బీఆర్ఎస్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. 

తెలంగాణలో బీఆర్ఎస్ తరపున మునుగోడు రూపంలో బోణీ కొట్టామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణలో బీజేపీకి బలం లేదని...మునుగోడులో వచ్చిన ఓట్లన్నీ రాజగోపాల్ రెడ్డి సొంత ఇమేజ్ తోనే వచ్చాయన్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.మునుగోడు గెలుపుతో నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గానూ12 సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించిందని ఆయన పేర్కొన్నారు.