మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తం

మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తం
  • మంత్రి గంగుల కమలాకర్
  • పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన మిల్లర్లు 

హైదరాబాద్‌, వెలుగు : మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదని సివిల్ సప్లయ్స్‌ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రి గంగుల, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ ను కలిసి తమ సమస్యలను వారికి వివరించారు. పోర్టిఫైడ్ రైస్ సరిగా లేవంటూ ఎఫ్‌సీఐ బియ్యాన్ని నిరాకరిస్తున్నదని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సీఎంఆర్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని మిల్లర్లు పేర్కొన్నారు. గత వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన కోటి టన్నుల ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల వద్ద పేరుకుపోయాయని తెలిపారు. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో తమ దగ్గర ఉన్న ప్రభుత్వ ధాన్యాన్ని వెనక్కితీసుకోవాలని, లేని పక్షంలో డీఫాల్ట్ పెట్టమనే హామీనిస్తే ప్రభుత్వ ధాన్యానికి కస్టోడియన్ గా మాత్రమే ఉంటామని స్పష్టం చేశారు. అవసరమైతే బహిరంగవేలం ద్వారా ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వాన్ని మిల్లర్లు కోరారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, దేశంలో రైతులు పండించిన పంటను రాజ్యాంగం ప్రకారం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులతో మిల్లింగ్ సమస్యలపై చర్చించి వీలైనంత త్వరగా స్టోరేజీని పెంచి ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోవాలని సూచించారు. 

మిల్లర్ల ఇబ్బందులను ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సివిల్‌ సప్లయ్స్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. వేలం ప్రక్రియకు కేంద్రం అనుతించాల్సి ఉన్నందున  మిల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీనిచ్చారు. కార్యక్రమంలో మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నాగేందర్, జనరల్ సెక్రటరీలు , మిల్లర్లు పాల్గొన్నారు.