కాంగ్రెస్సోళ్లు పాయఖానా నీళ్లు తాగించిన్రు.. మేమిచ్చిన భగీరథ నీళ్లతో రోగాలకు చెక్ 

కాంగ్రెస్సోళ్లు పాయఖానా నీళ్లు తాగించిన్రు.. మేమిచ్చిన భగీరథ నీళ్లతో రోగాలకు చెక్ 
  • కాలియాత్ర, మోకాలి యాత్ర అంటూ మోసం చేసేందుకు వస్తున్నరు
  • మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్​

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటకు పాయాఖానా నీళ్లు తాగించిన ఘనత కాంగ్రెస్ పాలకులకే దక్కుతుందని మంత్రి జగదీశ్​రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గా కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సురక్షిత నీరు అందుతోందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేటలోని ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ ప్రాంగణంలో కలెక్టర్ అధ్యక్షతన మంచినీటి పండుగ సంబరాలు నిర్వహించారు. దీనికి చీఫ్​గెస్ట్​గా హాజరైన జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ.. తమ పాలనలో స్వచ్ఛమైన మంచినీళ్లు ఇవ్వలేని కొందరు నేతలు కాలి యాత్ర, మోకాలి యాత్ర అంటూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారన్నారు. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రూ.917 కోట్లతో ఇంటింటికి సురక్షిత తాగునీరు సరఫరా చేస్తుండగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ. 5102.39 వేల కోట్లతో సరఫరా కొనసాగుతోందన్నారు. అవన్నీ మరిచిపోయిన కాంగ్రెస్ రేపో మాపో ఎన్నికలు వస్తున్నాయనగానే తొమ్మిదేండ్లలో ఏం చేశారంటూ విమర్శిస్తున్నారన్నారు. అలా మాట్లాడే గొంతుకలకు సమాధానం మూతి మీద కొట్టేలా ఉండాలన్నారు. మున్సిపల్ చైర్మన్ ​పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జలసాధన ఉద్యమ నేత దుశ్చర్ల సత్యనారాయణ, మిషన్ భగీరథ అధికారి సురేశ్​ ఇతర అధికారులు పాల్గొన్నారు.