- స్టెప్ వెల్ సర్క్యూట్ టూరిజం అభివృద్ధికి కృషి : మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: చారిత్రక కట్టడాల సంరక్షణే సర్కారు లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పునరుద్ధరించిన అడిక్ మెట్మెట్ల బావిని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ చారిత్రక బావికి పూర్వవైభవం తీసుకురావడంలో దొడ్ల డెయిరీ సంస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.కోటి విరాళాన్ని అందించడం అభినందనీయమన్నారు. సాహె సంస్థ ప్రతినిధులు 3 వేల టన్నుల చెత్తను తొలగించి ఈ బావికి పునర్జీవం పోశారని కొనియాడారు.
30 బావులను పునరుద్ధరించాం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 600 బావుల్లో ఇప్పటికే 30 బావులను పునరుద్ధరించామని, స్టెప్ వెల్ సర్క్యూట్ టూరిజంను అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మెట్ల బావుల పునరుద్ధరణకు రూ.10 కోట్ల మంజూరుకు కృషి చేస్తానన్నారు. డిసెంబర్లో రాష్ట్రంలోని 13 చారిత్రక ప్రాంతాల్లో బావిలీ ఆర్ట్ సంగమం పేరుతో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దొడ్ల డెయిరీ ఎండీ, సీఈవో సునీల్ రెడ్డి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివనాగిరెడ్డి ఉన్నారు.

