V6 News

తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే సహించం : మంత్రి కోమటి రెడ్డి 

తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే సహించం : మంత్రి కోమటి రెడ్డి 
  • రాష్ట్ర ప్రజలకు ఎంపీ తేజస్వి క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటి రెడ్డి​ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని అవమానిస్తే సహించే ప్రసక్తే లేదని ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యానించారు. స్వరాష్ట్ర కాంక్ష కోసం అగ్నికి ఆహుతున బిడ్డల త్యాగాలను పార్లమెంట్ వేదికగా అవమానిస్తారా? అంటూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. గురువారం హైదరాబాద్​లో మీడియాతో మంత్రి మాట్లాడారు. ‘నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడడం దుర్మార్గం. రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం హేయం.

రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపర్చిన ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. రాజ్యాంగ బద్ధంగా, పార్లమెంట్ ప్రక్రియ ద్వారా రాష్ట్రం ఏర్పడింది’ అని అన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అజ్ఞానపు మాటలపై లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్​ చేశారు.  రాజకీయ లబ్ధి కోసం దేశ సమగ్రతను, ప్రాంతీయ సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం భావ్యం కాదన్నారు. ‘తెలంగాణ సమాజాన్ని కించపరిచిన తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ ఇలాంటి విషపూరిత వ్యాఖ్యలు చేస్తోంది. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని’ మంత్రి పేర్కొన్నారు.